ఇక అమరావతి మాత్రమే ఏపీ రాజధాని

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఇక నుండి అమరావతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. విజయవాడలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మూడు రాజధానులు అంటూ  అమరావతి విషయంలో వైసిపి ప్రభుత్వం సృష్టించిన గందరగోళాన్ని చేరిపేసేందుకు ఆయన ప్రయత్నించారు. పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అయితే, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక ప్రభుత్వాన్ని నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఇన్నాళ‌లు ఆటలాడారని పేర్కొంటూ అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని తేల్చి చెప్పారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక నగరంగా, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందామని వెల్లడించారు. 
 
విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలకు చాలా ముఖ్యమని చెబుతూ 2014లో డా. హరిబాబు బీజేపీకి ఎంపీగా గెలిచారని, 2019లో వైసిపి ప్రభంజనంలో సహితం టీడీపీకి నాలుగు అసెంబ్లీ సీట్లను గెలిపించిన నగరం అని, అక్కడ ప్రజల్లో గణనీయమైన అభిమానం జనసేనకు ఉందని తెలిపారు.

ఎన్నికల్లో విశాఖపట్నం రాజధాని చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రచారం చేసినా నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని అభినందించారు. తాను విశాఖను మర్చిపోయే సమస్య లేదని, తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవంక, కర్నూలును కూడా మర్చిపోయేది లేదని తెలిపారు.

 
జ్యూడిషియల్ క్యాపిటల్ చేస్తామని కూడా ఏమి చేయలేదని చెబుతూ రాయలసీమలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని, ఊహించని మెజార్టీని సీమ ప్రజలు తమకు కట్టబెట్టారని గుర్తు చేశారు.  ఇకపై సిఎం వస్తుంటే చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడంఉండవని తేల్చి చెప్పారు.  దాడులు చేసి బాధితులు మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండకూడదని చెప్పారు.