మణిపూర్‌లో పోలీస్‌ అవుట్‌పోస్టులపై మూకలు దాడి

మణిపూర్‌లో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణిపూర్‌లోని జిర్‌బమ్‌ జిల్లాలో కొందరు అనుమానిత తిరుగుబాటుదారులు దుండగులు పోలీస్‌ స్థావరాలపై దాడిచేయడంతో పాటు కొన్ని నివాసాలకు నిప్పు పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
జిర్‌బమ్‌ జిల్లా పక్కనే ఉన్న బరాక్‌ నది నుండి మూడు నాలుగు బోట్లలో తిరుగుబాటుదారులు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
శుక్రవారం అర్థరాత్రి 12.30గంటల సమయంలో జిర్‌బమ్‌లోని ఛోటోబక్రాలోని దాడి ప్రారంభమైనట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.  మొదట ఛోటోబక్రా పోలీస్‌ స్థావరంపై దాడి జరిగిందని, అనంతరం లాంటైఖునౌ, మోధుపూర్‌లలోని పోలీస్‌ స్థావరాలపై తిరుగుబాటుదారులు దాడి చేసినట్లు వెల్లడించారు. ఛోటోబక్రాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరోబక్రాలోని పోలీస్‌ స్థావరంపై 2.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు మరో పోలీస్‌ అధికారి తెలిపారు.

కాగా, నది వెంబడి ఉన్న అనేక గ్రామాలపై కూడా తిరుగుబాటుదారులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టి సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్‌ పోలీస్‌ కమాండోలు జిరిబామ్‌కు చేరుకున్నారు. పోలీస్‌ పోస్టులపై దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టిన మూకల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు 59 ఏళ్ల వ్యక్తిని కుకీ తిరుగుబాటుదారులు హత్య చేశారు. దీంతో మళ్లీ జాతి ఉద్రిక్తతలు చెలరేగాయి.  దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ మొయితీలు  ఆందోళన చేపట్టారు.  తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో  జిరిబామ్ నగర శివార్లలో నివసిస్తున్న 250 మంది మైతీ వర్గం ప్రజలను అస్సాం రైఫిల్స్ సిబ్బంది శుక్రవారం ఖాళీ చేయించారు.