జూన్ 15 నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు

 
* ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
 
18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో సెషన్‌ ప్రారంభం కానుంది. 2రోజులపాటు ప్రమాణస్వీకార కార్యక్రమాలు కొనసాగిన అనంతరం కొత్త స్పీకర్‌ను ఎంపిక చేస్తారని సమాచారం. 
 
మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి సెషన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణ తేదీలను కొత్త కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుంది. ఈ సెషన్‌లో ప్రధానిమోదీ తన మంత్రిమండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. జూన్ 22న సమావేశాలు ముగిసే అవకాశముంది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

కాగా, మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్‌లో భద్రతా సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుంచి సాధారణ ప్రజలు, ప్రముఖులతో పాటు, ఇతర ముఖ్యమైన స్థావరాలకు ముప్పు కలిగించే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. 

పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లతోపాటు పారాగ్లైడింగ్‌ చేయడం, డ్రోన్లు, గాలి బుడగలు, రిమోటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేయడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్‌ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.