పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌

పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ కేసులో తీర్పును ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు జూలై 1కి రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో జూలై 1న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కెవిఐసి) చైర్మన్‌ వీకే సక్సేనా మేధా పాట్కర్‌పై పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసులో మేధా పాట్కర్‌ను దోషిగా తేలుస్తూ మే 24న సంచలన తీర్పు వెలువరించింది. అయితే శిక్షపై మే 30 వరకు వాదనలు విన్నది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం శిక్ష ఖరారును మాత్రం జూలై 1కి రిజర్వ్‌ చేసింది. కాగా పాట్కర్‌, సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి చట్టసంబంధ పోరాటం కొనసాగుతూ వస్తున్నది.

నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా వీకే సక్సేనా ప్రచార ప్రకటనలు ఇచ్చారని 2000 సంవత్సరంలో మేధాపాట్కర్‌ దావా వేయడంతో వారి మధ్య వివాదం మొదలైంది. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు అధిపతిగా ఉన్నారు.

మేధాపాట్కర్‌ దావా నేపథ్యంలో వీకే సక్సేనా ఆమెపై రెండు దావాలు వేశారు. మేధా పాట్కర్‌ తన గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఒక దావా, టీవీ ఛానెల్‌లో తన పరువుకు నష్టం కలిగించే ప్రకటన ఇచ్చారని మరో దావా వేశారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌ను ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ఈ నెల 24న దోషిగా ప్రకటించింది. ఇవాళ శిక్షను జూలై 1కి రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.