మెక్సికో దేశాధ్య‌క్షురాలిగా తొలిసారి మ‌హిళ

మెక్సికో దేశాధ్య‌క్షురాలిగా తొలిసారి మ‌హిళ
వాతావరణ శాస్త్రవేత్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, హక్కుల కార్యకర్త,  మెక్సికో సిటీ మాజీ మేయర్ డా. క్లాడియా షీన్‌బామ్ ఆదివారం నాటి ఓటింగ్‌లో భారీ మెజారిటీతో గెలిచి మెక్సికో అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ అయ్యారు. దేశ అధ్యక్షపదవికి, పార్లమెంటు దిగువ సభకు, సెనేట్‌కు, ఎనిమిది రాష్ట్రాల గవర్నర్ల పదవులకు, అలాగే మెక్సికో సిటీ మేయర్‌ పదవికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది.
 
షీన్‌బామ్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రధానంగా కాథలిక్ దేశాలలో ఒకదానికి నాయకత్వం వహించిన మొదటి యూదు వ్యక్తి కావడం కూడా గమనార్హం. అక్టోబర్‌ 1న నూతన అధ్యక్ష బాధ్యతలను ఆమె చేపడతారు. మొరెనా (మూవ్‌మెంట్‌ ఫర్‌ నేషనల్‌ రిజనరేషన్‌) పార్టీకి చెందిన 61 ఏళ్ల షీన్‌బామ్‌ లేబర్‌ పార్టీ (పిటి), గ్రీన్‌ ఎకాలజిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మెక్సికో కలిసి ‘లెట్స్‌ కంటిన్యూ మేకింగ్‌ హిస్టరీ’ అనే కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున బరిలోకి దిగి 58 శాతం ఓట్లతో విజయపతాక ఎగురవేశారు.
ఆమె ప్రధాన ప్రత్యర్థి, మితవాద కూటమి (పిఆర్‌ఐ, పిఎఎన్‌, పిఆర్‌డి) కి చెందిన సోచితిల్‌ గాల్వెజ్‌ 28 శాతం ఓట్లతో చాలా వెనుకబడిపోయారు. సిటిజెన్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అభ్యర్థి జోర్గె అల్వారెజ్‌ 10శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.  మెక్సికో జాతీయ ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించిన వెంటనే షీన్‌ బామ్‌ వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
”ఈ విజయం నాకు చాలా ఆనందం కలిగించింది. ఒక మహిళ ఈ అత్యున్నత స్థానానికి చేరుకోవడం 200 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ విజయం చేకూర్చిన మీకందరికీ కృతజ్ఞతలు. ఆమ్లో ప్రవేశపెట్టిన ‘ఫోర్త్‌ ట్రాన్సఫర్మేషన్‌’ (నాల్గవ పరివర్తన) పంథాలో ముందుకు సాగుదాం” అని ఆమె చెప్పారు.
అధ్యక్ష బరిలో రెండు ప్రధాన కూటముల నుంచి మహిళలే పోటీలో ఉండటం గమనార్హం. ఒకరు వామపక్ష వాది మోరెనా పార్టీకి చెందిన క్లాడియా షిన్‌బామ్‌ కాగా, మరొకరు మితవాద పార్టీ ‘ఫోర్స్‌ అండ్‌ హార్ట్‌ ఫర్‌ మెక్సికో కొయిలేషన్‌’ కు చెందిన సొచిల్లి గాల్వెజ్‌.  లాటిన్‌ అమెరికాలో రెండవ అతిపెద్ద దేశమైన మెక్సికోకు ఒక మహిళ తొలిసారి అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం తథ్యం. 
 
వామపక్ష భావజాలంకు చెందిన చెందిన క్లాడియా షిన్‌బామ్‌ సహచరుడైన ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రిస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ (ఆమ్లో) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక  ఉదారవాద విధానాలకు అడ్డుకట్ట వేసి, ప్రజానుకూల విధానాలకు పెద్ద పీట వేశారు.
 
 “మనం బహుళ,  వైవిధ్య, ప్రజాస్వామ్య మెక్సికోను సాధించాము,” అని షీన్‌బామ్ చెప్పారు.  “చాలా మంది మెక్సికన్లు మన ప్రాజెక్ట్‌తో పూర్తిగా ఏకీభవించనప్పటికీ, న్యాయమైన, మరింత సంపన్నమైన మెక్సికోను నిర్మించడాన్ని కొనసాగించడానికి మనం శాంతి, సామరస్యంతో నడవాలి” అని ఆమె పిలుపిచ్చారు. 
అన్ని స్థాయిల్లోను మొరేనా పార్టీ నేతృత్వంలోని కూటమి విజయ ఢంకా మోగించడం విశేషం. షీన్‌బామ్ విశేష ప్రజాదరణ పొందిన వామపక్ష నేత లోపెజ్ ఒబ్రాడోర్‌కు సన్నిహితురాలు.  ఆరు సంవత్సరాల పదవీకాలం ముగిడ్యాడంతో ఆయన మళ్లీ పదవికి పోటీ చేయడానికి అవకాశం లేదు.