ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ. 1100 కోట్ల నేరం.. రూ. 292 కోట్లలో కవిత పాత్ర

* ఛార్జిషీట్‌లో ఈడీ సంచలన విషయాలు

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే.. ఈడీ కేసులో జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కస్టడీని పొడిగించింది. 
 
ఈసారి వారం రోజులో పది రోజులో కాకుండా ఏకంగా జులై 3వ తేదీ వరకు నెల రోజుల పాటు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. మరోవైపు.. సీబీఐ కేసులో జూన్ 7 వరకు కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
 
 కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై ఈడీ మే 10న ఛార్జిషీట్ దాఖలు చేయగ తాజా ఛార్జిషీట్‌ను స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలను అధికారులు కోర్టు ముందు ఉంచారు. లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తంగా రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా రూ. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. మరోవైపు.. కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని కూడా ఈడీ పేర్కొంది.
 
పీఎంఎల్ఏ సెక్షన్‌ 44, 45 కింద మొత్తం 177 పేజీలతో ఛార్జిషీట్‌ ఫిర్యాదు కాపీ రూపొందించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్, మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. అందులో ఎమ్మెల్సీ కవిత 32వ నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 24 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించిన ఈడీ, 18 మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. 
 
శరత్‌చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించిన ఈడీ, కవిత అసిస్టెంట్‌ అశోక్‌, ఆడిటర్‌ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ను ఛార్జీషీట్‌లో చేర్చింది. 44 మంది సాక్షుల జాబితాను ఛార్జిషీట్‌తో జతపరిచిన ఈడీ, కవితపై కోర్టు వెంటనే ట్రయల్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది.
 
కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత “జై తెలంగాణా, జై భారత్” అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. పాస్ పోర్టు సరెండర్ చేయాలంటూ నిందితులను న్యాయస్థానం ఆదేశించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చరణ్ ప్రీత్ కేసు విచారణను జులై 3కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు సీబీఐ కేసులోనూ ఇవాళ్టితో కవిత కస్టడీ ముగియగా, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అధికారులు కవితను జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈ నెల 7 వరకు జ్యుడీషియల్​ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జూన్​ 7న సీబీఐ కవితపై ఛార్జిషీట్​ దాఖలు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 26వ తేదీ నుంచి కవిత తిహాడ్ జైళ్లో ఉన్న విషయం తెలిసిందే.