కౌంటింగ్‌ కేంద్రంలోకి పెన్ను, పేపరును మాత్రమే అనుమతిస్తాం

కౌంటింగ్‌ కేంద్రంలోకి పెన్ను, పేపరును మాత్రమే అనుమతిస్తాం

ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మీనా, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 

ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు, ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారిగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు పై సీఈవో పలు సూచనలు చేశారు. 

ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం పై సూచనలు జారీ చేశారు. మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు.

ఓట్ల కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌ కిషోర్‌ వెల్లడించారు. రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి పెన్ను, పేపరు మినహా వేటిని అనుమతించమని స్పష్టం చేశారు. 

ఈ నెల 4న ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అన్నారు. అన్ని పార్టీల ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 6 వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

 పల్నాడు జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్ధం చేశారు. నరసరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూలో ఈ నెల 4న కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టెబుళ్లు ఏర్పాటు చేశారు. మెుత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు.

 జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురజాల నియోజకవర్గం నుంచి తుది ఫలితం వెల్లడి కానుంది. కౌంటింగ్ రోజు దాడులు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు.