భగ్గుమంటున్న ఢిల్లీ .. తొలిసారి 52.3 డిగ్రీల నమోదు

భగ్గుమంటున్న ఢిల్లీ .. తొలిసారి 52.3 డిగ్రీల నమోదు

వాయువ్య, మధ్య భారతంలో తీవ్రమైన వడగాలుల మధ్య నేపథ్యంలో రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటున్నాయి. బుధవారం ఢిల్లీలోని ముంగేష్ పూర్ లో 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

మరోవైపు, ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  మే 31న దేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 2024 మే 31న పంజాబ్, హర్యానా- చండీగఢ్-ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది.

దేశంలోని అనేక ప్రాంతాలు కూడా జలవనరులపై విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఒకవైపు, తట్టుకోలేని స్థాయికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు, తగ్గిపోతున్న భూగర్భ జలవనరులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెంగళూరులో అధికారులు అనవసరంగా నీటిని వృధా చేయవద్దని పౌరులకు ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం సాయంత్రం ఢిల్లీలో కొద్దిగా వర్షం కురియడంతో తేమ స్థాయి పెరిగే అవకాశం ఉంది. 30 మిలియన్ జనాభా కలిగిన ఢిల్లీకి ఐఎండి హెల్త్ నోటీస్ జారీతో అప్రమత్తం చేసింది. అత్యధిక వేడికి జనం అస్వస్తులవుతారని, అన్ని వయస్కుల వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

ఈ వేడిని భరించలేక ప్రజలు ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాన్లు ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో విద్యుత్ డిమాండ్ 8302 మెగావాట్లకు పెరిగింది. తాజాగా ఢిల్లీలో పైప్ తో వాహనాలను కడగడం, గృహావసరాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వంటి కార్యకలాపాలను నిషేధించారు. అలా నీటిని వృథా చేసినవారికి రూ .2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.