చిరంజీవికి యూఏఈ గోల్డెన్‌ వీసా

చిరంజీవికి యూఏఈ గోల్డెన్‌ వీసా
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. మొన్నటికి మొన్న దేశంలోనే అత్యుత్తమ పురష్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న చిరుకు తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి గోల్డెన్‌ వీసా వరించింది. 
 
ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి దుబాయ్‌ ప్రభుత్వం ఈ గోల్డెన్‌ వీసాలు అందించిన విషయం తెలిసిందే. గతవారం తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా గోల్డెన్‌ వీసా అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి ఆ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరుకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివ‌సించే వీలు ఉంటుంది.

 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయ‌డం మొద‌లైంది. ఈ వీసాల‌కు 10 సంవ‌త్సరాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఆ త‌ర్వాత అవే రెన్యువ‌ల్ అవుతాయి. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం క‌ల్పించే అన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే వంద శాతం ఓన‌ర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవ‌చ్చు.

ఇక యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డెన్ వీసాను భార‌త్ నుంచి సినీ ప్రముఖుల్లో మొద‌ట‌గా షారుఖ్‌ఖాన్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత బాలీవుడ్ న‌టులు సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి, మౌనీ రాయ్‌, ఫ‌రా ఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ , నేహా క‌క్కర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ఈ వీసాను పొందారు.  ఈ వీసాను అందుకున్న తొలి త‌మిళ కథానాయిక‌గా త్రిష రికార్డుకెక్కింది. ఆమె త‌ర్వాత అమ‌లాపాల్ ఈ వీసాను పొందింది.

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ విష‌యానికొస్తే మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, టోవినో థామ‌స్‌, దుల్కర్ స‌ల్మాన్ ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఈ వీసా అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఉపాస‌న నిలిచారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు కూడా ఈ వీసా వరించింది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భ‌ర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.