తీరం దాటిన రెమాల్.. బంగాల్లో తుపాన్ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, బంగాల్​ సరిహద్దుల్లో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుపాను ధాటికి బంగ్లాదేశ్​, బంగాల్​లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తుండడం వల్ల పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
 
అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు లక్ష మందిని తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉడండం వల్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు.
 
పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత ప్రజలను అధికారులు ముందుగానే అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. కాగా, తుఫాన్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో 8 లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.