దేశంలో వరుస బాంబు బెదిరింపు కాల్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాత్రి ముంబయిలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్లు వచ్చాయి.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందకు దించేసి ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది, విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముంబయిలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు సోమవారం రాత్రి పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ కాల్ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చినట్లు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలె భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు. తమిళనాడు చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి మోదీని హతమారుస్తానని బెదిరించాడు.
ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్‌ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి సైతం బాంబు బెదిరింపు వచ్చింది.
నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని దిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఈమెయిల్‌ను దుండగులు పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష