ఆరో విడతలో 61.25 శాతం పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 11.45 గంటల వరకు 61.25 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా బెంగాల్‌లో 52 శాతం, అత్యల్పంగా ఢిల్లీలో 34.4 శాతం ఓటింగ్‌ నమోదైంది.  2019 ఎన్నికలలో ఆరవ విడత 64.4 శాతం పోలింగ్ జరిగింది.
 
ఆరోవిడత ఎన్నికల్లో ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ నియోజక వర్గాలు, యూపీలో 14, హర్యానాలోని మొత్తం 10, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లో 8 చొప్పున, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 4, జమ్ము-కశ్మీర్‌లో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజవర్గాలు, హర్యానాలోని కర్నల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగింది. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఆరో విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌, కేంద్ర మంత్రులు ఎస్‌.జయశంకర్‌, హర్దీప్‌ సింగ్‌ పురి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఢిల్లీ మంత్రి అతిశీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్  కుమార్,కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఓటేశారు. 

పోలింగ్‌ బూత్‌లో తొలి పురుష ఓటర్‌గా ఓటు హక్కును వినియోగించినందుకు అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్‌ను మంత్రి జయశంకర్‌ షేర్‌ చేశారు. ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జర్గ్రామ్‌ బీజేపీ అభ్యర్థి ప్రణత్‌ తుడుపై రాళ్ల దాడి చేయడంతో ఆయన భయంతో పరుగులు తీశారు.

 కాగా, ఈవీఎం మొరాయించిందని సీపీఐ(ఎం) నేత బృందా కారత్‌, తమవారిని అడ్డుకోవడంపై మెహబూ బా ముఫ్తీ నిరసన తెలిపారు. ఆరో విడత పోలింగ్ ముగియడంతో ఇంకా మిగిలిన 57 లోక్‌సభ స్థానాలకు ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు