రేవ్ పార్టీలో నటి హేమతో సహా 8 మందికి నోటీసులు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు శివారు ప్రాంతంలోని జీఆర్​ ఫాంహౌస్​లో నిర్వహించిన రేవ్​ పార్టీలో పాల్గొన్న 8 మందికి విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది. తెలుగు సినిమా సహాయ నటి హేమ సహా 8 మందికి నోటీసులు పంపించారు. ఈనెల 27న కేసు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో సూచించినట్లు సీసీబీ వర్గాలు తెలిపారు.

కాగా, బెంగళూరు రేవ్​ పార్టీ డ్రగ్స్​ కేసులో సినీనటి హేమపై జరుగుతున్న ప్రచారాన్ని మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ అధ్యక్షుడు మంచు విష్ణు ఖండించారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెపై వ్యక్తిగతంగా దూషించడం తగదని హితవు పలికారు. 

నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన కోరారు. హేమ దోషిగా రుజువు అయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలని సూచించారు. అలాగే మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని పేర్కొన్నారు. హేమకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను పోలీసులు తమకు అందజేస్తే మా అసోసియేషన్​ తగిన చర్యలు తీసుకుంటుందని ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు.

 మే 20వ తేదీ రాత్రి బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్​ స్టేషన్ పరిధిలోని జీఆర్​ ఫామ్​హౌస్​లో జరిగిన రేవ్​ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన స్థలంలో ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్యే పాస్​తో కూడిన కారులో కొన్ని మత్తు పదార్థాలు లభించాయి. ఈ దాడిలో పార్టీలో పాల్గొన్న 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పార్టీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వాసు, యం.అరుణ్​కుమార్​, నాగబాబు, రణధీర్​బాబు, మహ్మద్​ అబూబకర్​లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పార్టీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వాసు, యం.అరుణ్​కుమార్​, నాగబాబు, రణధీర్​బాబు, మహ్మద్​ అబూబకర్​లను పోలీసులు అరెస్టు చేశారు.

రేవ్​ పార్టీలో పాల్గొన్న 103 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటి ఫలితాల కోసం రెండు రోజులు ఎదురు చూశారు. వైద్య పరీక్షల ఫలితాల్లో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు సహా 86 మంది డ్రగ్స్​ తీసుకున్నట్లు నివేదికలో నిర్ధారణ అయింది. వీరిలో 8 మందికి విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.