అహ్మదాబాద్ లో ఉగ్రవాదుల అరెస్ట్ తో కోహ్లీ భద్రతకు ముప్పు!

కీలకమైన ఐపీఎల్ క్రీడలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కావడానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద నలుగురు ఉగ్రవాదులు పట్టుబట్టడంతో క్రీడాకారుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ భద్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
 
ఎలిమినేటర్‌ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో ఆర్సీబీ జట్టు బుధవారం పోటీ పడుతున్నది. అయితే ఈ పోరుకు ముందు ఆర్సీబీ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ ఆడాల్సి ఉంది. కానీ ఆ జట్టు అనూహ్యంగా భద్రతా కారణాల దృష్టా  ప్రాక్టీస్ సెషన్​ను రద్దు చేసుకుంది. ఆర్సీబీ, రాజస్థాన్‌ జట్లకు పోలీసులు సమాచారమిచ్చారు. దీంతో ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్​ను రద్దు చేసుకుంది.
 
‘అరెస్ట్​ విషయం కోహ్లీకి తెలిసింది. అతడు జాతీయ నిధి. విరాట్​ భద్రతే అత్యధిక ప్రాధాన్యం. అందుకే రిస్క్‌ తీసుకోలేమని ఆర్సీబీ యాజమాన్యం చెప్పింది. ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కానీ, రాజస్థాన్‌ టీమ్ మాత్రం య తమ ప్రాక్టీస్‌ చేసింది’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.  అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ వల్ల ఆర్సీబీ ప్లేయర్స్ ఉన్న హోటల్‌ దగ్గర భారీ సెక్యూరిటీని మొహరించారు. 
 
ప్రత్యేక ఎంట్రీని కూడా ఏర్పాటు చేశారు. ఐపీఎల్‌ అనుబంధ మీడియా సిబ్బందిని కూడా అనుమతించట్లేదని తెలిసింది. రాజస్థాన్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్​ కోసం ప్రయాణించిన బస్సును కూడా మూడు పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌ చేశాయని తెలిసింది. అలానే వారు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనూ మెదానం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
 
కాగా, అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన నలుగురు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను  విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం మేరకు గుజరాత్‌ ఏటీఎస్ నలుగురిని అరెస్టు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆదేశాల మేరకు వీరు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్‌కు వచ్చినట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. 
 
అరెస్టయిన నలుగురు నిందితులు పాకిస్థాన్‌లో నివసిస్తున్న శ్రీలంక నాయకుడి వద్ద పనిచేస్తున్న ఐఎస్ సభ్యులని తెలిపాయి.  ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ దేశ్‌బంధు తెన్నకోన్ ఆధ్వర్యంలో బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికార ప్రతినిధి, సీనియర్ సూపరింటెండెంట్ నిహాల్ తాల్దువా తెలిపారు. 
 
ఈ దర్యాప్తులో వారు నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటారన్నారు. ఈ విషయాన్ని, పరిణామాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భారత అధికారులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి నుంచి ఈ నలుగురు వ్యక్తులు పాక్‌లో నివసిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ నాయకుడైన అబు అనే వ్యక్తితో పరిచయం ఉందని గుజరాత్‌ డీజీపీ వికాష్‌ సహాయ్‌ పేర్కొన్నారు.సోషల్‌ మీడియా ద్వారా ఆయనతో టచ్‌లో ఉన్నారని, భారత్‌లో ఉగ్రవాద దాడులకు అబు వారిని ప్రేరేపించాడని చెప్పారు. ఆత్మాహుతి బాంబు దాడికి కూడా సిద్ధమయ్యాడని, అబు శ్రీలంక కరెన్సీలో నాలుగు లక్షలు సైతం ఇచ్చినట్లు చెప్పారు. రెండు మొబైల్ ఫోన్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌లో అహ్మదాబాద్ సమీపంలోని నానా చిలోడా ప్రాంతం ఫొటోను గుర్తించారు. 

ఉగ్రదాడి చేసేందుకు మందుగుండు సామగ్రిని ఇక్కడ దాచినట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నుఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రజ్దీన్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి పాక్‌లో తయారు చేసిన మందుగుండు సామగ్రి, మూడు పాకిస్థానీ పిస్టల్స్, 20 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.