స్వాతి మలివాల్‌ వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు

సొంతపార్టీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఆప్‌ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అంటూ బుధవారం ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

‘ఆప్‌ సీనియర్‌ నేత నుంచి నిన్న నాకు కాల్‌ వచ్చింది. నాపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలిపారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారట’ అని తెలిపారు. 

“అంతేకాదు నాకు వ్యతిరేకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించే బాధ్యతలు కొందరికి, సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేసే బాధ్యత మరికొందరికి అప్పగించారట. నిందితులకు సన్నిహితంగా ఉన్న కొందరు రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయించాలని చేస్తున్నారు” అని స్వాతి మలివాల్‌ తన ట్వీట్‌లో ఆరోపించారు. 

వేల మంది సైన్యాన్ని దింపినా తాను ఒంటరిగా ఎదుర్కొంటానని ఈ సందర్భంగా స్వాతి స్పష్టం చేశారు. నిజం తనవైపే ఉందంటూ తన ఆత్మగౌరవం కోసం పోరాటం ప్రారంభించానని.. న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

కాగా, స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈనెల 13న సీఎం నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో బిభవ్‌ తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను అరెస్ట్‌ చేశారు.

 అదేవిధంగా సీఎం నివాసం నుంచి నిందితుడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.