123 ఏళ్ళ తర్వాత అలీఘర్‌ యూనివర్శిటీ విసిగా మహిళ

అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు) వైస్‌ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం కేంద్ర విద్యాశాఖ ఆమెను విసిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె యూనివర్శిటీ విజిటర్‌గా ఉన్నారు.

ఎఎంయు 123 ఏళ్ల చరిత్రలో విసిగా నియమితులైన మొదటి మహిళగా ఖాతూన్‌ చరిత్ర సృష్టించారు. బేగం సుల్తాన్‌ జహాన్‌ 1920లో ఎఎంయు ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉన్న మొదటి, ఏకైక మహిళగా ఆమె నిలిచారు. ఖాతూన్‌ నియామకంతో మహిళా వైస్‌ ఛాన్సలర్‌లను కలిగిన మూడవ సెంట్రల్‌ యూనివర్శిటీగా ఎఎంయు నిలిచింది. 

శాంతిశ్రీ ధూలిపూడి పండిట్‌ ప్రస్తుతం జెఎన్‌యు వైస్‌ ఛాన్సరల్‌ కాగా, నజ్మా అక్తర్‌ 2023లో జామియా మిలియా ఇస్లామియా వైస్‌ ఛాన్సలర్‌గా తన పదవి కాలాన్ని పూర్తి చేశారు. జెఎన్‌యు చరిత్రలో శాంతిశ్రీ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ కావడం గమనార్హం.  ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్‌ అనుమతి కూడా తీసుకున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఏఎంయూలో సైకాలజీలో పీహెచ్‌డీ అందుకున్న ఆమె, 5 ఏండ్లపాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో ఏర్పాటైన ముహమ్మదన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ ..1920లో ‘అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.  నైమా ఖాతూన్‌ 1988, ఆగస్టులో ఎఎంయు లెక్చరర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. పదేళ్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2006లో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

సైకాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌, చైర్‌పర్సన్‌గా పనిచేశారు.  అనంతరం 2014 జులైలో మహిళా కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఎఎంయులో వివిధ అడ్మినిస్ట్రేటివ్‌ పదవుల్లోనూ కొనసాగారు. విదేశీ యూనివర్శిటీల్లోనూ ఏడాది పాటు భోదన కొనసాగించారు. నైమా ఖాతూన్‌ పొలిటికల్‌ సైకాలజీలో పిహెచ్‌డి పట్టా పొందారు. 

విదేశాల్లోని పలు యూనివర్శిటీల్లో తన పరిశోధనా ఫలితాలను సమర్పించారు. ఆమె క్లినికల్‌, హెల్త్‌, అప్పీలైడ్‌ సోషల్‌, స్పిర్చువల్‌ సైకాలజీల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె 6 పుస్తకాలను రచించారు.