కాంగ్రెస్ పాల‌న‌లో హ‌నుమాన్ చాలీసా విన‌డం కూడా నేర‌మే

కాంగ్రెస్ పాల‌న‌లో హ‌నుమాన్ చాలీసా విన‌డం కూడా నేర‌మేన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను లాగేసుకుని వాటిని ఎంపిక చేసిన‌ కొంద‌రికి క‌ట్ట‌బెట్టేందుకు కాంగ్రెస్ నేత‌లు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. రాజ‌స్ధాన్‌లోని స‌వోయి మాధోపుర్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రాజ‌స్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామ న‌వమి వేడుక‌ల‌ను నిషేధించింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. రాజ‌స్ధాన్‌లో తొలిసారిగా ఈసారి రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా శోభాయాత్ర జ‌రిగింద‌ని ఆయ‌న గుర్తుచేశారు. 

ప్ర‌జ‌లు రామ శ‌బ్ధాన్ని ఆల‌పించే రాజ‌స్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామ‌నవ‌మిని నిషేధించింద‌ని ప్రధాని ధ్వజమెత్తారు.  కొద్దీ రోజుల క్రితం కాంగ్రెస్ పరిపాలిస్తున్న కర్ణాటకలో ఒక షాప్ యజమాని తన షాపులో కూర్చొని హనుమాన్ చాలీసా వింటుంటే అతనిని దారుణంగా కొట్టారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.

రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, విప‌క్ష ఇండియా కూటమికి ఈ వ్యాఖ్య‌లు ఆగ్ర‌హం క‌లిగించాయ‌ని, అందుకే వారు ప్ర‌తిచోటా మోదీని తిడుతున్నార‌ని పేర్కొన్నారు.  ప్ర‌జ‌ల ఆస్తుల‌పై స‌ర్వే చేస్తామ‌ని కాంగ్రెస్ త‌న మేనిఫెస్టోలో పొందుప‌రిచింద‌ని, ఆస్తుల ఎక్స్‌రే చేప‌డ‌తామ‌ని వారి నేత చెప్పార‌ని మోదీ గుర్తుచేశారు. మోదీ వారి బండారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంతో వారి ర‌హ‌స్య అజెండా బ‌య‌ట‌ప‌డి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ని తెలిపారు. .

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌త్యేక ఓటు బ్యాంకు కోసం ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని ఆ పార్టీ ప్ర‌య‌త్నించింద‌ని, ద‌ళితులు.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల రిజ‌ర్వేష‌న్ల‌ను ఆ పార్టీ బ్రేక్ చేసింద‌ని ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించారు. రాజ్యాంగం దీనికి పూర్తిగా వ్య‌తిరేకంగా ఉంద‌ని స్పష్టం చేశారు. కేవ‌లం మ‌తం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఇచ్చింద‌ని దయ్యబట్టారు.

 ద‌ళితులు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, గిరిజ‌నుల‌కు ద‌క్కాల్సిన హ‌క్కుల‌ను ముస్లింల‌కు ఇచ్చిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను త‌గ్గించాల‌ని భావించింద‌ని ప్రధాని గుర్తు చేశారు. ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను ముస్లింల‌కు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పారు. 

ఏపీలో నాలుగు సార్లు ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌ని,  కానీ చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కుల వ‌ల్ల అది సాధ్యం కాలేద‌ని ప్రధాని తెలిపారు.  మోదీ మీకో గ్యారెంటీ ఇస్తున్నార‌ని, ద‌ళితులు.. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, గిరిజ‌నుల‌కు చెందిన రిజ‌ర్వేష‌న్ల‌ను తీసివేయ‌మ‌ని, మ‌తం ఆధారంగా ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను విభ‌జించ‌బోము అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. త‌న‌కు రాజ్యాంగం అర్థం అవుతుంద‌ని, రాజ్యాంగ ర‌క్ష‌ణ‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌ను తాను ఆరాధిస్తాన‌ని ప్ర‌ధాని తెలిపారు.