మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు

పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల పోరు అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. పార్టీల మధ్య  కంటే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి  మమతా బెనర్జీల మధ్యనే పోటీ అని చెప్పేలా మారాయి. గతసారి కంటే ఎక్కువ సీట్లు సాధించి మమతకు గట్టి షాక్‌ ఇవ్వాలనే బీజేపీ పట్టుదలగా ఉన్నది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర తరివాత అత్యధికంగా 42 లోక్ సభ స్థానాలు ఇక్కడ ఉన్నాయి.

మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, బెంగాల్‌లో మాత్రం అన్ని స్థానాల్లో తృణమూల్‌ ఒంటరిగానే బరిలో నిలిచింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, ఉపాధి నిధులను కేంద్రం విడుదల చేయకపోవడం, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష, పౌరసత్వ సవరణ చట్టం(సీఎఏ)తో జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. 

సీఎఏతోపాటుగా, సందేశ్‌ఖాలీ ఘటనను బీజేపీ ముఖ్యమైన ప్రచారాస్ర్తాలుగా చేసుకొన్నది. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని కమలం నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌తోపాటు ఒకప్పుడు తమ కంచుకోటగా ఉన్న బెంగాల్‌లో ఉనికి కోసం కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మమతకు చాలా కీలకం. టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పలు కేసుల్లో టీఎంసీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. సందేశ్‌ఖాలీ ఘటన కూడా ఆ పార్టీని కలవరపెడుతున్నది. 

మరోవైపు ప్రతి ఎన్నికల మాదిరిగానే వలస కార్మికులు, మైనారిటీల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమత సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంతో చట్టబద్ధమైన పౌరులను విదేశస్తులుగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, సీపీఎంలకు ఓటేస్తే, అది బీజేపీ సహకరించినట్టేనని ప్రచారం చేస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా రాష్ట్రంలోని 42 నియోజకవర్గాలకుగానూ 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కేవలం 17 శాతం ఓట్లతో రెండు సీట్లు మాత్రమే గెలుచుకొన్న కమలం పార్టీ  2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు షేర్‌ను ఏకంగా 40 శాతానికి పెంచుకోవడంతోపాటు 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకొన్నది. 

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అంతకంటే మెరుగ్గా సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. తద్వారా రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం చేపట్టే దిశగా తీసుకెళ్లాలని కమలనాథులు ప్లాన్లు రచిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, భూఆక్రమణకు సంబంధించి టీఎంసీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందేశ్‌ఖాలీ కేసును ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల అంశంగా మార్చి.. టీఎంసీ లక్ష్యంగా ముప్పేట విమర్శలు గుప్పిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికల వేళ అమల్లోకి తీసుకొచ్చిన సీఏఏ ప్రభావం 10-12 స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నదని కమలం పార్టీ భావిస్తున్నది. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపే బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన మథువా, దళిత బెంగాలీ హిందువులు, పలు ఎస్సీ గ్రూపుల ఓట్లపై ఆశలు పెట్టుకొన్నది.  రాష్ట్రంలో టీఎంసీ పాలనలో అవినీతి పెద్దయెత్తున పెరిగిపోయిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. టీఎంసీకి రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి, బంధుప్రీతి, ప్రజలను మోసగించడమే ప్రధానమని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.