కర్ణాటక రెబెల్‌ నేత ఈశ్వరప్పపై బీజేపీ వేటు

కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరిస్తున్నట్లు సోమవారం బిజెపి ప్రకటించింది. ఆయన గతంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.  ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది.
ఈశ్వరప్ప సొంత నియోజకవర్గం శివమొగ్గ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. హవేరీ నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు కేఈ కంఠేష్‌కు అవకాశం ఇస్తారని ఆశించినా ఫలించలేదు.
శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రను బరిలోకి దింపింది. దీనిపై తీవ్ర అసంతృప్తికి లోనైన ఈశ్వరప్ప ఇండిపెండెంట్‌గా శివమొగ్గ నుంచే పోటీలో నిలిచారు. నామినేషన్ సైతం దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవాలంటూ ఈశ్వరప్పను బుజ్జగించినప్పటికీ ఫలితం రాలేదు.
 
 పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రంగంలోకి దిగినా ఫలితం రాలేదు. దీనితో ఈశ్వరప్పను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా రాజ్‌కుమార్ ఇక్కడ పోటీలో ఉన్నారు.