తోట త్రిమూర్తులకు హైకోర్టులో చుక్కెదురు

 శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. 28 ఏళ్ల క్రితం దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో తోట త్రిమూర్తులును దోషిగా తేలుస్తూ ఏప్రిల్ 16న విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్షను నెల రోజులు వాయిదా వేసి, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విశాఖ కోర్టు తీర్పును త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. జైలు శిక్షపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్ట జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.

తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా 28 ఏళ్ల నాటి కేసులో కోర్టు జైలు శిక్ష విధించింది. రెండేళ్ల  లోపు జైలు శిక్ష పడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు న్యాయపరంగా చిక్కులు లేకపోయినప్పటికీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో ఈ శిక్ష పడటంతో రాజకీయ ప్రభావం గురించి వైసిపి నాయకత్వం తికమక పడుతున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే దళిత డ్రైవర్ హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్సీ అనంతబాబు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తోట త్రిమూర్తులును  కూడా పోటీలో కొనసాగిస్తే పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకు అయినా దళితుల నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వైసీపీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. 
 
పైగా, ఈ అంశం ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మరింత విమర్శలు చేసేందుకు అవకాశం కల్పించినట్లు కాగలదు. దీంతో మండపేటలో అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. తోట త్రిమూర్తులు స్థానంలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అవకాశం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.