పదో తరగతి ఫలితాల్లో ఏలూరు బాలికకు మొదటి స్థానం

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి,2024 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పరీక్షలకు 6.23 లక్షల మంది(రెగ్యులర్) విద్యార్థులు హాజరవ్వగా5,34,574 మంది అంటే 86.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్ స్థానంలో నిలవగా, 62.47 శాతం ఉత్తీర్ణతతో కర్నూల్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. 
 
ఈ ఏడాది కూడా టెన్త్‌ ఫలితాల్లో  బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా ఉంది. ఈ ఏడాది పది పరీక్షల్లో మొత్తం 600 మార్కులకు 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి ప్రథమ ర్యాంకు సాధించింది. 
 
హిందీ సబ్జెక్ట్(99 మార్కులు) మినహా అన్నింటినీ ఈ విద్యార్థినికి నూటికి నూరు మార్కులు వచ్చాయి. మనస్వి పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్.ఎస్.సి బోర్డు పేర్కొంది. విజయవాడలో ఎపి విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. ఫలితాలను https://results.bse.ap.gov.in వెబ్‌ సైట్‌లో చూడొచ్చు. పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి విదితమే.
 
రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి కొన్ని పాఠశాలలు రికార్డు సృష్టించాయి. మొత్తం 2,803 పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అంటే జీరో ఉత్తీర్ణత శాతం వచ్చింది. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ స్కూల్స్  ఉండగా,  మిగిలిన ఒకటి ప్రభుత్వ పాఠశాల కావడం విశేషం.

ఏపీ పదో స్థరగతి ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో సాధించారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మరో 4 రోజుల్లో ఎస్ఎస్.సి వెబ్‌సైట్‌ నుంచి టెన్త్ మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.