ఇజ్రాయిల్ భద్రతా దళంపై అమెరికా ఆంక్షలు!

ఇజ్రాయిల్‌ భద్రతా దళం (ఐడిఎఫ్‌)కిచెందిన నెట్జా యెహుదా బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఈ సైనికుల బృందం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు అమెరికా పేర్కొంది. దీంతో నెట్జా యెహుదా బెటాలియన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చనున్నట్లు సమాచారం.

ఇజ్రాయిల్‌ సైన్యంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీసుకునే మొదటి చర్యలు ఇవే కానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ చర్యలను ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ ఖండించారు. తమ సైన్యం తీవ్రవాదులైన మాన్‌స్టర్స్‌తో పోరాడుతోందని గుర్తు చేశారు.  ఐడిఎఫ్‌పై ఆంక్షలు విధించడం అసంబద్ధమైన చర్య, నైతికత అత్యల్ప స్థాయి అని  నెతన్యాహూ పేర్కొంటూ అమెరికా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

అమెరికా చర్యను ఇజ్రాయిల్‌ మంత్రులు ఇటమార్‌ బెన్‌ జివిర్‌, బెజాలెల్‌ స్కోట్రిచ్‌లు కూడా  వ్యతిరేకించారు.  తమ దళాలపై ఆంక్షలు విధించడం ప్రమాదానికి సంకేతమని జివిర్‌ పేర్కొన్నారు. ఈ చర్య తీవ్రమైనదని, తమ బృందాన్ని రక్షించుకుంటామని అన్నారు. అమెరికా ఆంక్షలకు తలొగ్గకూడదని  ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌ను వారు కోరారు.

మరోవంక, పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వెస్ట్‌ బ్యాంక్‌లోని నూర్‌ షామ్స్‌ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన ఆపరేషన్‌లో 14 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది.  కాగా, 14 మంది అమరులను నూర్‌ ష్యామ్స్‌ క్యాంప్‌ నుంచి దవాఖానకు తరలించినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ వెల్లడించింది. అంతకు ముందు ఇజ్రాయెల్‌ దాడుల్లో 11 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది.

శుక్రవారం రాత్రి రఫా శివారు టెల్‌ సుల్తాన్‌లోని నివాసభవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు.  ఇజ్రాయెల్‌ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్‌ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారు.