సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా

ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ వంటి పార్టీలు ‘సైద్ధాంతికంగా దివాలా తీశాయి’ అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా విమర్శించారు. బిజెపిని వ్యతిరేకించేందుకు దేశ రాజధానిలో సుహృద్భావ సంబంధాలు సాగించే ఆ పార్టీలు ఢిల్లీ వెలుపల మాత్రం పరస్పరం ఎన్నికల్లో పోటీ పడుతుంటాయని ఆయన ఎద్దేవా చేశారు.

బిజెపి అభ్యర్థి కె సురేంద్రన్‌కు మద్దతుగా ఎన్‌డిఎ సుల్తాన్ బథెరిలో నిర్వహించిన ఒక రోడ్‌షోకు హాజరైన నడ్డా  రాహుల్ గాంధీ కుటుంభం రాజకీయాలలో మునిగి తేలుతున్నారని, సంతృప్తికరంగా రాజకీయాలు చేస్తున్నారని నడ్డా విమర్శించారు. ఇటువంటి ధోరణులు దేశ ప్రజాస్వామ్యంకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. 

అమేథీలో పోటీచేస్తే ఓడిపోతామని తెలిసే రాహుల్ వాయనాడ్ నుండి తిరిగి పోటీచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిషేధిత పిఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన ఎస్ డి ఎఫ్ ఐ మద్దతును ఇక్కడ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ డి ఎఫ్ ఐ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు, అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంకు మద్దతు ఇస్తూ ఉంటుందని చెబుతూ ఈ రెండు పార్టీలు కూడా దేశ వ్యతిరేక శక్తులతో అంటకాగుతున్నాయని ఆయన ప్రజలను హెచ్చరించారు.

 ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎల్‌డిఎఫ్ అభ్యర్థి అన్నీ రాజా (సిపిఐ) మధ్య ఎన్నికల పోటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నడ్డా తన వాదనకు సమర్ధనగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఈ పోరు గురించి మాట్లాడారు. 

ఇతర ప్రాంతాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్నా న్యూఢిల్లీలో వాటి అగ్ర నాయకత్వాల మధ్య సాగుతున్న మైత్రి గురించి ఆయన మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ (ఎం), సిపిఐ ద్వంద్వ ప్రమాణాలు, కపటం ఇక్కడ కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి’ అని విమర్శించారు. 

సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య (అన్నీ రాజా) ఎల్‌డిఎఫ్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. అయితే, ఢిల్లీలో డి రాజా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్య కూర్చుంటారు. వారు సైద్ధాంతికంగా దివాలా తీశారు. దాని ఫలితం ఇక్కడ కనిపిస్తోందని నడ్డా ధ్వజమెత్తారు.  ఇవిఎంలో లోపాలు లేనట్లయితే బిజెపి 180కి మించి సీట్లు గెలవబోవడం లేదు అన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపణ గురించి ప్రశ్నించినప్పుడు బిజెపి అధ్యక్షుడు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించారు.

కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ నేతలకు ఇవిఎంలతో సమస్యలు ఏవీ లేకపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రియాంకను, ఆమె సోదరుడు రాహుల్‌ను ‘రాజకీయ పర్యాటకులు’గా నడ్డా పేర్కొంటూ, ‘వారు ఎన్నికల కోసం వచ్చి, మాయమైపోతారు. వారి ప్రకటనలను ఎందుకు తీవ్రంగా పరిగణిస్తుంటారు’ అని పేర్కొన్నారు.

‘వారు కర్ణాటకలో గెలిచినప్పుడు వారికి ఇవిఎంలతో సమస్యలు లేవు. వారు ఐదు సంవత్సరాల పాటు రాజస్థాన్‌లో పాలించినప్పుడు వారి ఇవిఎంలతో సమస్యలు లేవు’ అని నడ్డా ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలమైన ఉనికి లభిస్తుందని పార్టీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.  ‘దక్షిణాదిలో ఎంతో ఉత్సాహం చూశాను. వయనాడ్‌లో సురేంద్రన్ కోసం రోడ్ షోలో అది గమనించాను. ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. అధిక సంఖ్యలో జనం వచ్చారు’ అని నడ్డా చెప్పారు.