తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 102 సీట్లకు 21 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలో జరిగిన పోలింగ్‌లో రాత్రి 9 గంటల వరకు 62.37 శాతం పోలింగ్‌ నమోదైంది. 

అయితే 2019 ఎన్నికలు (69.43 శాతం) మొదటి విడతతో పోలిస్తే ఇది తక్కువేనని ఈసీ తెలిపింది. పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకే ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరడంతో రాత్రి 7 గంటల తర్వాత కూడా పోలింగ్‌ కొనసాగింది. మొదటి విడత ఎన్నికల్లో 1600 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, వారిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ ఉన్నారు. 

మొదటి విడత పోలింగ్‌లో అత్యధికంగా తమిళనాడులో-39, రాజస్థాన్‌లో-12, ఉత్తర ప్రదేశ్‌లో-8, మధ్య ప్రదేశ్‌లో-6, ఉత్తరాఖండ్‌లో-5 లోక్‌సభ స్థానాలలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌ (60), సిక్కిం (32) అసెంబ్లీలకు కూడా శుక్రవారమే పోలింగ్‌ జరిగింది.

రాత్రి 9 గంటల వరకు తమిళనాడులోని 39 స్థానాల్లో 65.19%  (2019 పోలింగ్ శాతం 72.44%), ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాల్లో 54.06% (2019లో 61.88%), త్రిపురలోని ఒక స్థానంలో అత్యధికంగా 80.17%, పశ్చిమ బెంగాల్‌లో మూడు స్థానాలలో 77.57% నమోదు కాగా, బీహార్ లో మొదటి దశలో నాలుగు స్థానాలలో అత్యల్పంగా 48.50% (2019లో 54 శాతం)  పోలింగ్ నమోదైంది.

నాగాలాండ్‌లో, రాత్రి 9 గంటల నాటికి మొత్తం 56.91% పోలింగ్ నమోదైంది, అయితే ఈసీ ఓటర్ టర్నౌట్ యాప్ 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో 19లో ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనలేదని వెల్లడి చేస్తుంది.  ప్రత్యేక పరిపాలన కోసం డిమాండ్‌పై కొన్ని జిల్లాల్లో బహిష్కరణకు పిలుపుఇచ్చారు. 

బస్తర్‌లోని 56 గ్రామాలలో మొదటిసారిగా పోలింగ్ నిర్వహించగా, గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగ కూడా మొదటిసారి ఓటు వేసినట్లు ఈసీ తెలిపింది. తొలి దశ పోలింగ్ సంతృప్తికరంగా సాగిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. “రెండేళ్ళుగా కష్టపడి పనిచేసిన ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ధన్యవాదాలు. మొదటి దశలో జరిగిన పోలింగ్ తదుపరి దశలకు శుభసూచకం” అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో ఇలా తెలిపారు: “మొదటి దశ, గొప్ప స్పందన! ఈరోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. నేటి ఓటింగ్ నుండి అద్భుతమైన అభిప్రాయాన్ని పొందడం. భారతదేశం అంతటా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్‌డిఎకు ఓటు వేస్తున్నారని స్పష్టమవుతోంది”.

ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, బెంగాల్‌ రాష్ర్టాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా రాష్ర్టాల్లో పోలింగ్‌ ప్రశాంతంగానే ముగిసింది. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు వెంటనే కలుగజేసుకుని వాటి స్థానంలో వేరేవి ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇద్దరు వృద్ధులు పోలింగ్‌ బూత్‌లలో మరణించారు.

తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని గాల్గమ్‌ గ్రామంలో అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌(యూబీజీఎల్‌) ప్రమాదవశాత్తూ పేలడంతో విధులు నిర్వర్తిస్తున్న జవాన్‌ మృతి చెందాడని అధికారులు తెలిపారు. 

మరో ఘటనలో బైరాంగఢ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చిహ్కా పోలింగ్‌ కేంద్రం సమీపంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి మరో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో కూచ్‌బెహర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. మణిపూర్‌లోని ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గం థమ్నాపోక్పి ఏరియాలో ఓటర్లను చెదరగొట్టేందుకు కొంత మంది సాయుధ వ్యక్తులు గాల్లోకి పలు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.