పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి

పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలి దశ పోలింగ్‌  ప్రారంభమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నారు. 
 
ఇక తొలి విడత పోలింగ్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. 

‘2024 లోక్‌సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి..! మొత్తం 21 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసే వారంతా తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయనున్నవారు అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఓటూ చాలా ముఖ్యమైనదే..!’ అంటూ ట్వీట్‌లో మోదీ రాసుకొచ్చారు.

కాగా, సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా, 134 మంది మహిళా అభ్యర్థులు. 8 మంది కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు.

మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ దశలో 21 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అస్సాం, మహారాష్ట్రలో 5, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. 

 
ఇది కాకుండా తమిళనాడు (39), మేఘాలయ (2), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), అండమాన్ నికోబార్ దీవులు (1), మిజోరాం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం ( 1) ), లక్షద్వీప్ (1) లోక్‌సభ స్థానాల్లో కూడా ఓటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 50, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. మార్చి 30న అరుణాచల్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు.