భారత నేవీ చీఫ్‌గా దినేష్ త్రిపాఠి

నేవీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం నేవీ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే మే 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆర్మీలో మరిన్ని మార్పులు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

ప్రస్తుతం త్రిపాఠి నేవీ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్‌. హరికుమార్‌ అనంతరం నేవీలో సీనియర్‌ అధికారి దినేష్‌ త్రిపాఠినే కానుండటంతో ఆయనను నేవీ చీఫ్‌గా నియమించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. త్రిపాఠి భారత నావికాదళంలో 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. గతంలో కీలకమైన అసైన్‌మెంట్‌లలో పనిచేశారు.

1964 మే 15న జన్మించిన దినేష్ త్రిపాఠి  1985 జులై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో చేరారు. దినేష్ త్రిపాఠి మధ్యప్రదేశ్‌లోని సైనిక్ స్కూల్ రేవా, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యనభ్యసించారు.  వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పొందారు. అమెరికా నావల్ వార్ కాలేజీలోని నావల్ కమాండ్ కాలేజీలో ప్రతిష్టాత్మక కోర్సులు తీసుకున్నారు.

కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌లో నిపుణుడిగా పేరుగాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వైఫ్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్‌ వినాస్‌, కిర్చ్, త్రిశూల్‌తో సహా అనేక నావికాదళ నౌకలకు నాయకత్వం వహించారు.