ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కువగా కూల్చింది అమెరికానే

ఈ నెల 13న ఇజ్రాయెల్‌ వైపు ఇరాన్‌ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్‌ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్‌ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చేరుకునేలోపు సగానికిపైగా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఆ దేశ సైనిక అధికారులు తెలిపారు. 

ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల్లో సగానికిపైగా సాంకేతికంగా విఫలమయ్యాయని చెప్పారు. మిగతా సగం క్షిపణులు, డ్రోన్లలో 80 శాతానికిపైగా అమెరికా ధ్వంసం చేసిందని అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్‌’కు తెలిపారు. అయితే ఏ మిలిటరీ బేస్‌ నుంచి యుద్ధ విమానాల ద్వారా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను అమెరికా అడ్డుకున్నదో అన్నది వెల్లడించలేదు.

కాగా, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 13న తొలిసారి ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేసింది. సుమారు 330కుపైగా క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్‌ వైపు ప్రయోగించింది. అయితే బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్‌) అనేక ఇరాన్ క్షిపణులను అడ్డగించి కూల్చిందని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. 

అలాగే పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను కూల్చినట్లు జోర్డాన్ ప్రభుత్వం కూడా పేర్కొంది. మరోవైపు సుమారు 25 క్రూయిజ్ క్షిపణులను దేశ సరిహద్దుల వెలుపల తమ ఫైటర్ జెట్‌లు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) తెలిపింది.  అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జోర్డాన్‌ వంటి మిత్రదేశాల సహాయంతో 99 శాతానికిపైగా ఇరాన్‌ ఆయుధాలను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యాలని ఛేదించేలోగా అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇతర దేశాల సహకారంతో అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది.

మరోవంక, ఇరాన్‌పై ప్రతిదాడులకు దిగొద్దని ఇజ్రాయెల్‌ను ప్రపంచ దేశాల నేతలు కోరారు. ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రతిదాడులకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని యూకే విదేశాంగ శాఖ మంత్రి కామరూన్‌ స్పష్టం చేశారు.
 
గాజా యుద్ధం పెచ్చరిల్లుతుండడంతో అమెరికా, ఇజ్రాయెల్ కు తోడ్పడింది. అయితే ఇజ్రాయెల్ ప్రతి దాడులకు పూనుకుంటే మాత్రం తాము దూరంగా ఉంటామని కూడా స్పష్టం చేసింది. అంటే ఇరాన్ ను నివారించేంత మేరకే అమెరికా, ఇజ్రాయెల్ కు సహకరించనున్నది.