ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్‌

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సీజ్‌ చేసి ట్రెజరీలో జమ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఆయన గురువారం పరిశీలించారు. ముందుగా గుండ్లపల్లిలో వాహనాల తనిఖీ తీరు, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తున్న విధానంపై చెక్‌పోస్ట్‌లోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

ఇప్పటి వరకు సీజ్‌ చేసిన నగదు, ఇందుకు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం శింగరాయకొండ మండలం పాత శింగరాయకొండ వద్ద చెక్‌పోస్టును పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని చెప్పారు. 

 జిల్లాలోని చెక్‌పోస్టుల పనితీరుపై సిఇఒ సంతప్తి వ్యక్తం చేశారు. చెక్‌పోస్టుల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేయడానికి ప్రకాశం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులపాటు తాను పర్యటిస్తున్నట్లు ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్తృతం చేస్తున్నామని వివరించారు. 

సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. అయితే, తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యవహరించాలని అధికారులను  ఆదేశించినట్లు సీఈవో వివరించారు.

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 18వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు.  ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉందని, ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు.