తమిళనాడులో లోకేష్, కర్ణాటకలో పవన్ ప్రచారం

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్న టిడిపి, జనసేన నేతలు పొరుగు రాష్ట్రాలలో తెలుగు వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థుల ప్రచారం కోసం వెడుతున్నారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులోని కోయింబత్తూరులో పోటీ చేస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా ప్రచారం చేసేందుకు గురువారం వెళ్లారు. ఆయన అక్కడ 11, 12 తేదీలలో ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ 17న కర్ణాటకలో బిజెపి అభ్యర్థుల ప్రచారంకోసం వెడుతున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో గత ఏడాది అధికారం కోల్పోయిన బిజెపి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలు గెల్చుకొనేందుకు పట్టుదలతో పనిచేస్తున్నది.

తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు అయిన రాయచూర్, బళ్లారి, చిక్కబళ్లాపూర్, బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గాల్లో  పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించడానికి స్థానిక బిజెపి నాయకులూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు రాజా అమరేశ్వర నాయక్, బళ్లారి శ్రీరాములు, డాక్టర్ సుధాకర్ రెడ్డి, బెంగళూరులో తేజస్వి సూర్యలకు మద్దతుగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.