రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలి…ఎన్డీయే పాలన రావాలి

రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలి…ఎన్డీయే పాలన రావాలని టిడిపి, జనసేన, బిజెపి అగ్రనేతలు పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలు, తణుకులలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరిలతో కలసి పాల్గొంటూ కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఏన్డీయే ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  చెప్పారు. 
 
కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రూ.10లు ఇచ్చి 100 దోచేది జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు. మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైందని ప్రజాగళం వినిపిస్తామని పేర్కొన్నారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారని చెబుతూ కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు.

కూటమి అభ్యర్ధులుగా రాజమండ్రి పార్లమెంటుకు పురందేశ్వరీ, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ లు నిలబడ్డారని, వారిని ఆశ్వీర్వదించాలని చంద్రబాబు కోరారు. నిడదవోలులో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని ,వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే అని స్పష్టం చేశారు.

జగన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని, కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఆక్సిజన్‌లా బ్రతికిస్తుందని చెబుతూపోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలని, రాజధాని కట్టుకోవాలని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తిచేసుకోవాలని, ఇవన్నీ నెరవేరాలంటే నరేంద్ర మోదీ  సహకారం అవసరం అని చంద్రబాబు చెప్పారు.

గాడితప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్డీఏ కూటమికి మెండుగా ఉంది. నరేండ్ర మోదీ  నాయకత్వాలో 2047 కి భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా నిలవబోతోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థల్లో దేశం ఒకటో, రెండో స్థానాల్లో ఉండ బోతుందని అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకపబకూడదని, దేశంతో పాటు రాష్ట్రం కూడా సూపర్ పవర్ గా ఎదగాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

జగన్ రెడ్డిని చూసి అందరూ పారిపోతున్నారని పేర్కొంటూ ఆయన పార్టీ శాసనమండలి సభ్యులు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా బయటకు వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.  రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంటూ మనతో కలుస్తున్నారని చెబుతూ ఎమ్మెల్సీ ఇక్బాల్, రామచంద్రయ్య, వంశీ లాంటి వారు బయటకు వచ్చారని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెదిరెడ్డి లాంటి నలుగురు రెడ్లకు అప్పగించాడని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి అన్యోన్యంగా ముందుకు వెళుతుంటే జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిచ్చులో జగన్ రెడ్డే దగ్ధం అవుతాడని హెచ్చరించారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఓటుతో త్రిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు.