12 మంది మావోయిస్టులు లొంగుబాటు

12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్‌ చేశారు. తలపై కోటి రివార్డ్‌ ఉన్న మావోయిస్ట్‌ మిసిర్ బెస్రా గ్రూప్‌కు చెందిన వారు లొంగిపోయినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 

ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అటవీ ప్రాంతమైన సరందా, కోల్హాన్‌లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన 12 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బంది ముందు లొంగిపోయినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి గురువారం తెలిపారు. తలపై కోటి రివార్డ్‌ ఉన్న మిసిర్ బెస్రా బృందంలోని మావోయిస్టులు సరెండర్‌ అయ్యారని చెప్పారు.

కాగా, మావోయిస్టుల కంచుకోట అయిన జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ లోక్‌సభ స్థానంలో మే 13న పోలింగ్‌ జరుగనున్నది. సుమారు దశాబ్ద కాలంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్న అంతర్గత ప్రాంతాల ప్రజలు తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బృందాలు, పోలింగ్‌ సామగ్రిని హెలికాప్టర్‌ల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించనున్నారు.