హిందువులు బౌద్ధంలోకి మారాలంటే ముందస్తు అనుమతి

హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్‌ మతస్వేచ్ఛ చట్టం – 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటూ  ఏప్రిల్‌ 8న గుజరాత్‌ రాష్ట్ర హోంశాఖ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. బౌద్ధం, జైన, సిక్కు మతాల్లోకి మారేందుకు దరఖాస్తులు వచ్చినప్పుడు ఆర్టికల్‌ 25(2) ప్రకారం ఈ మతాలు హిందూ మతంలోనే ఉన్నందున అనుమతి అవసరం లేదని పలువురు అధికారులు చెప్తున్నారని సర్క్యులర్‌లో పేర్కొన్నది. 
 
అయితే, గుజరాత్‌ మతస్వేచ్ఛ చట్టంలో బౌద్ధం ప్రత్యేక మతంగా ఉన్నందున ఈ చట్ట ప్రకారం హిందుత్వం నుంచి బౌద్ధం తీసుకునేందుకు నిర్దిష్ట ఫార్మాట్‌లో జిల్లా మెజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. సిక్కు, జైన మతాలకు మారే వారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నది.
 
హిందూ మతంలో కుల వివక్షకు వ్యతిరేకంగా దసరా వంటి పండగల సందర్భంలో దళితులు బౌద్ధమతంలోకి మూకుమ్మడిగా మారడం ఈ రాష్ట్రంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో బౌద్ధంలోకి మారినవారు ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అహ్మదాబాద్‌లో ఒకేసారి 400 మంది బౌద్ధమతాన్ని స్వీకరించారు. 
 
2022 అక్టోబరులోనూ గిర్‌ సోమ్‌నాథ్‌లో 900 మంది బౌద్ధం తీసుకున్నారు. హిందూమతం నుంచి బౌద్దమతానికి మారేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించే సమయంలో కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్‌లు చట్టానికి, ఆ నిబంధనలకు తప్పుగా భాష్యం చెబుతున్నారని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.
 
గుజరాత్‌ బుద్ధిస్ట్‌ అకాడమీ(జీబీఏ)తో పాటు మరికొన్ని సంస్థలు మతమార్పిడి కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. కాగా, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను జీబీఏ కార్యదర్శి రమేశ్‌ బాంకర్‌ స్వాగతించారు. ఈ ఉత్తర్వుల ద్వారా బౌద్ధం ప్రత్యేక మతమని, హిందుత్వంతో సంబంధం లేదనే విషయం తేటతెల్లమైందని ఆయన వ్యాఖ్యానించారు.