ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర

మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

“మీరు భవిష్యత్తును చూసి ఆస్వాదించాలనుకుంటే అందుకోసం పనిచేయాలనుకుంటే భారత్‌కు రండి. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా” అని గార్సెట్టి తెలిపారు. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని తెలిపారు.

భారత దేశ ఎన్నికల పక్రియను ప్రశంసిస్తూ అమెరికాలో ఎన్నికల పక్రియను మరింత మెరుగు పరచేందుకు భారత్ నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. “మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. నేర్చుకోవడానికి వచ్చాం” అంటూ ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను నొక్కి చెప్పారు.
 
భారతదేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం గురించి ఇటీవలి వివాదాల గురించి అడిగినప్పుడు, దౌత్యవేత్త అమెరికా చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.   “అమెరికా ఒక విలక్షణమైన ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రభుత్వంలోని ప్రతి శాఖ, న్యూస్ మీడియా, పౌర సమాజం వివిధ దేశాల గురించి తమ స్వంత అభిప్రాయాలను కలిగి ఉంటాయ” అని చెప్పారు.
 
“ఈ అభిప్రాయాలు బహిరంగ అమెరికన్ రాజకీయ వ్యవస్థలో భాగంగా తరచుగా బహిరంగంగా ప్రసారం అవుతాయి. అదే సమయంలో, ఈ ఉదారవాద నీతిలో భాగంగా ఇతర దేశాల నుండి విమర్శలను కూడా స్వీకరించడానికి అమెరికా సిద్ధంగా ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు. 
కాగా, భారత్, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ తెలిపారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని వైట్‌హౌస్ మీడియా సమావేశంలో తెలిపారు. 

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులోభారతీయుడిపై అభియోగాలు రావడం, ఇరు దేశాల మధ్య బంధంపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ సలివాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఈ కేసుపై ఢిల్లీ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.