
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు 1,200 ఎకరాలు అవసరం కాగా 2016లో అప్పటి ప్రభుత్వం ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను సేకరించిం, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారు.
అప్పటికీ స్థలం సరిపోకపోవడంతో 2020లో మరోసారి అక్కడి రైతులు సముద్రాల యాకస్వామి, సముద్రాల వెన్నెలకు చెందిన మరో 20 ఎకరాల భూమిని కూడా తీసుకునేందుకు కసరత్తు చేసింది. వారికి కూడా నాలుగేళ్ల కిందట ఇచ్చినట్టుగానే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటం, తాము జీవనాధారం కోల్పోతున్నామనే ఉద్దేశంతో యాకస్వామి, వెన్నెల ఆ ధరతో భూములు ప్రభుత్వానికి అప్పగించడానికి నిరాకరించారు.
భూములకు డిమాండ్ పెరగడంతో కనీసం డబుల్ ధర అయినా చెల్లించాలని కోరారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం తరఫున నోటీసులు ఇచ్చి యాకస్వామి, వెన్నెలకు చెందిన భూమిని తీసుకున్నారు. దాంతో 2022లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు పెరిగిన ధరలకు అనుగుణంగా 20 ఎకరాలకు రూ.2కోట్ల 40 లక్షల 14 వేలు పరిహారం చెల్లించాలని వరంగల్ ఆర్డీవోను ఆదేశిస్తూ గత సంవత్సరం మే 9న ఆదేశాలు ఇచ్చింది.
అయినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. సరైన స్పందన లేకపోవడంతో హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 27న కూడా మరోసారి అదే ఆదేశాలను ఇచ్చింది. వరంగల్ జిల్లా అధికారులు హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పెడచెవిన పెట్టారు. దీంతో ఆర్డీవో, జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు