రూ. 2 లక్షల కోట్ల ధరణి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి

దాదాపు రూ.2లక్షల కోట్ల కుంభకోణం జరిగిన ధరణి అక్రమాలపై సిబిఐ  జరిపించాలని బిజెపి శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.  విదేశీ కంపెనీకి క్రాంటాక్టు ఇచ్చి, ఫాల్కన్ కంపెనీని తెరమీదకు తీసుకువచ్చి వారితో ఒప్పందం చేసుకొని, విదేశీ కంపెనీతో ధరణి పోర్టల్ తీసుకువచ్చి గత బీఆర్ఎస్ సర్కార్ అతిపెద్ద కుంభకోణం చేసిందని తెలిపారు.
 
నెల రోజుల్లో ప్రభుత్వ భూముల మీద విచారణ జరిపి అక్రమార్కులను కటకటాకలకు పంపిస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 115 రోజులు గడుస్తున్నా ధరణి కుంభకోణాన్ని వెలిక్కి తీయకపోవడం వెనుక కారణం ఏందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన భూములను లాక్కొని దాదాపు 20లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఆయన తెలిపారు.

గతంలో కోకాపేట భూముల విషయంలో నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ధర్నాలు చేసి సీబీఐ కి లెటర్ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట్లాడడం లేదని తెలిపారు. మియాపూర్ భూముల్లో కే.కేశవరావు హస్తం ఉందని 2017లో ఆరోపించిన రేవంత్ రెడ్డి ఈరోజు కేకే  కడిగిన ముత్యం అయ్యారని ఎద్దేవా చేశారు.
 
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ల మీద అనేక ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ గతంలో అవినీతి చేసిన వ్యక్తులను, నాయకులను టార్గెట్ చేసి  కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మహేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి అవినీతి మీద మాట్లాడకుండా  కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. 
 
 రూ.2లక్షల కుంభకోణంలో కాంగ్రెస్ నాయకులు 40శాతం వాటా అడుగుతూ కేసీఆర్, కేటీఆర్ లను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డికి చిత్తశుధ్ధి ఉంటే తక్షణమే సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్  ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని లక్షల ఎకరాలు మటుమాయం జరిగి, ప్రైవేట్ కంపెనీ చేతిలోకి వెళ్లి లక్షల ఎకరాల కుంభకోణం జరిగితే రేవంత్ రెడ్డి సీబీఐ, జ్యుడీషియల్ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదో చెప్పాలని బిజెపి నేత నిలదీశారు. ధరణి పోర్టల్ ద్వారా 20లక్షల మంది రైతులు బాధపడుతున్నారాని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేస్తూ  వాళ్లందరికి ఎప్పుడు న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 24లక్షల ఎకరాల అసైన్డ్ భూములుఉంటె, ప్రస్తుతం తెలంగాణలో కేవలం 6లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  అట్టడుగు బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అయి  ఎక్కడికి పోయాయని బిజెపి నేత నిలదీశారు. 
 
ఆ భూములను ఎవరు పట్టా చేసుకున్నరు? ఎవరు అమ్ముకున్నరనేది ఇప్పటివరకు సమగ్ర సర్వే జరగలేదని తెలిపారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల భూములు పేదలకు పంచినట్టు రికార్డులు ఉన్నాయని చెప్పారు.

అంతేకాకుండా 1.30లక్షల ఎకరాలు భూదాన్ భూములు, ఒక లక్షల ఎకరాల ఎండోమెంట్ భూముల్లో కనీసం 40శాతం భూములు కూడా రికార్డుల్లో కనిపించడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  రంగారెడ్డి లోని సీతారాంపూర్ లోని 11వందల ఎకరాలు ఎండోమెంటు భూములను తక్కువ ధరలకు పరిశ్రమలకు ఇచ్చి, తెరవెనుల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారని ఆయన ఆరోపించారు.