నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్చాతీవు అప్పగింత

భారతదేశ తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ విమర్శలు చేశారు. కచ్ఛాతీవుకు సంబంధించి 1974లో పార్లమెంట్‌లో అప్పటి విదేశాంగ మంత్రి స్వరణ్‌ సింగ్‌ మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల నడుమ లోక్‌సభ ఎన్నికల ముందు వివాదం నడుస్తోంది. దేశభద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా, స్పృహలేకుండా నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది.

‘స్వేచ్ఛగా, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్‌) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో మాదిరిగానే మత్స్యకారుల వేట, నేవిగేషన్‌ హక్కులను ఇరుదేశాలు సమానంగా పొందుతాయి’ అని స్వరణ్‌ సింగ్‌ చెప్పినట్లు జైశంకర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇది జరిగిన రెండేళ్లలో నాటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని చెప్పారు. ఆ ఒప్పందం ప్రకారం.. శ్రీలంక సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయంచారని తెలిపారు. నాడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6,184 మంది భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారని చెప్పారు.

అదేవిధంగా 1,175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్‌ చేశారని మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.

కాగా, కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదు. ఏళ్ల నుంచి కొనసాగుతోంది. వివరాల కోసం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐలో పిటిషన్‌ వేయడంతో దానికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేయటంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.