దిలీప్‌ ఘోష్‌, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ చీవాట్లు

బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్‌ల గౌరవానికి భంగం కలిగేవిధంగా వారు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది.

తమ నోటీసులకు దిలీప్‌ ఘోష్‌, సుప్రియా శ్రీనేత్‌ సమాధానాలను స్వీకరించిన అనంతరం ఈసీ ఆ ఇద్దరికీ చీవాట్లు పెడుతూ ఆదేశాలు ఇచ్చింది. మమతాబెనర్జిపై బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ అమర్యాదకర వ్యాఖ్యలు చేయడంతో విషయం ఈసీ దాకా వెళ్లింది. 
 
వ్యక్తిగత దూషణలకు దిగి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ ఇద్దరికీ నోటీసులు పంపింది. అందుకు వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని ఈసీ చీవాట్లు పెట్టింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇద్దరినీ ఈసీ హెచ్చరించింది. ఆ ఇద్దరి ఎన్నికల సంబంధ వ్యవహారాలను తాము ఇప్పటి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తన ఆదేశాల్లో పేర్కొంది. మళ్లీ తప్పుచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

దీలీప్ ఘోష్ ఇటీవల మమతా బెనర్జీపై విమర్శలు గుప్పిస్తూ, దీదీ (మమతాబెనర్జీ) గోవాకు వెళ్తే గోవా డాటర్‌గా, త్రిపుర వెళ్తే త్రిపుర డాటర్‌గా చెప్పుకుంటారనీ, అసలు ఆమె తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.  కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తు్న్న నటి కంగనా రనౌత్‌పై సుప్రియా శ్రీనేత్ ఒక ట్వీట్ చేశారు. ”మండిలో ప్రస్తుతం రేటెంత?” అంటూ సుప్రియ చేసిన ట్వీట్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.