రాహుల్ పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు బిజెపి డిమాండ్‌

 
* ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు … అమిత్ షా
 

ఢిల్లీలో ఆదివారం జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన “మ్యాచ్ ఫిక్సింగ్” వ్యాఖ్యలు, ఇతర విమర్శల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై “కఠినమైన చర్యలు” తీసుకోవాలని బిజెపి సోమవారం ఎన్నికల సంఘాన్ని కోరింది.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌లతో కూడిన బిజెపి ప్రతినిధి బృందం గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పూరీ, బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కేవలం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించడమే కాకుండా తీవ్రమైన చిక్కులను కలిగిస్తాయని, “చాలా అభ్యంతరకరం” కలిగించేవని స్పష్టం చేశారు.
 
“నిన్న బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ ఇది (లోక్‌సభ ఎన్నికలు) ఫిక్స్‌డ్ మ్యాచ్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌లో తమ వ్యక్తులను మోహరించిందని ఆయన ఆరోపించారు. ఈవీఎంల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగం రద్దు చేయబడుతుంది (మార్చబడుతుంది) అన్నారు” అని ఆయన విలేకరులతో తెలిపారు.
 
 “రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు, విపక్షాల భారత కూటమికి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘాన్ని కోరాము” అని పూరీ తెలిపారు. గాంధీ పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అరుణ్ కుమార్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం అడ్డుకొనేందుకు ఎన్నికల సంఘం ఆయనను మాట్లాడకుండా నిరోధించడాన్ని పరిగణించాలని ఆయన సూచించారు.

బీజేపీకి ఈ ఎన్నిక‌లు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్ర‌భుత్వం సొంత మ‌నుషులున్నార‌ని, మోదీ ఈవీఎంలు లేకుండా గెల‌వ‌లేర‌ని ప‌లు అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని హ‌ర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విష‌యాల‌న్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువ‌చ్చామ‌ని, ఈ ఆరోప‌ణ‌ల‌ను ఈసీ తోసిపుచ్చింద‌ని, వీట‌న్నింటికి స‌రైన ఆధారాలు లేవ‌ని పేర్కొంద‌ని చెప్పారు.

భార‌త రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను కేంద్ర పాల‌కులు లాగేసుకున్నార‌ని రాహుల్ ఆరోపించార‌ని, కాషాయ పార్టీకి 400 సీట్లు ద‌క్కితే రాజ్యాంగాన్ని ర‌ద్దు చేస్తామ‌ని ఓ బీజేపీ కార్య‌క‌ర్త చెప్పార‌ని రాహుల్ అస‌త్యాలు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. అలా అని ఏ కార్య‌క‌ర్త చెప్పాడో త‌మ‌కు తెలియ‌ద‌ని ఆయన పేర్కొన్నారు. ఇండియా విప‌క్ష కూట‌మి చీలిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కేవ‌లం నోటీసు జారీ చేస్తే స‌రిపోద‌ని, ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని హ‌ద్దీప్ పూరి డిమాండ్ చేశారు.

కాగా, దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా  బహుశా రాహుల్‌ గాంధీకి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలియదేమో అంటూ  మండీ లోక్‌సభ బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్‌ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మండి జిల్లాలోని భీమకాళీ ఆలయం పరిసరాల్లో బీజేపీ జరిపిన సమావేశంలో ఆమె పాల్గొంటూ  ప్రజాస్వామ్యం హత్యకు గురైతే ప్రజలకు మద్దతుతో పని ఉండదని వ్యాఖ్యానించారు.

‘దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైతున్నట్లయితే ఇప్పుడు మనమంతా దేనికి సిద్ధమవుతున్నాం? ఎందుకు ప్రజలను ఆకర్షిస్తున్నాం? ఎందుకు వారి మద్దతు కోరుతున్నాం? మనం ప్రజల నమ్మకం, మద్దతు, సహకారం కోరుకుంటున్నాం. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనా?’ అని కంగనా ప్రశ్నించారు. ‘మనం ప్రజల మద్దతు కోరుతున్నమంటే  దాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనరు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఇది. బహుశా రాహుల్‌ గాంధీకి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం తెలియదేమో ’ అని కంగనా సెటైరికల్‌ కామెంట్‌ చేశారు.

కాగా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని, బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తోందని, మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.  సికార్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోసం భారీ రోడ్‌షో నిర్వహిస్తూ  “ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు, ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టింది, పార్టీలను నిషేధించింది. అవినీతికి పాల్పడే వాడు కటకటాల వెనక్కి వెళ్ళుతారు. మీరు ఎన్ని పార్టీలు కలిసినా మోదీ మాత్రమే వస్తారు” అంటూ  ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు.