‘ఇండియా జిందాబాద్’’ అంటూ పాక్ జాతీయుల నినాదాలు

అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఇరాన్ నౌక – అల్-కంబర్ ను భారతీయ నౌకాదళం రక్షించింది. ఆ నౌకను హైజాక్ చేసిన సాయుధులైన 9 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకుంది. ఆ రవాణా నౌకలో ఉన్న పాకిస్తాన్ కు చెందిన 23 మంది సిబ్బందిని ప్రాణాలతో కాపాడింది.
 
దాంతో, ఆ నౌక లోని పాక్ సిబ్బంది ‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సాయుధ సముద్రపు దొంగల నుండి తమను రక్షించినందుకు భారత నావికాదళానికి ధన్యవాదాలు తెలిపారు.  ఇరాన్ కు చెందిన ఆ అల్-కంబర్ నౌకలో 23 మంది పాక్ సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోమాలియా సముద్రపు దొంగలు తమను హైజాక్ చేశారని, వారందరినీ భారత నౌకాదళం రక్షించిందని ఒక వీడియోలో పేర్కొన్నారు. 
 
మొత్తం 23 మంది పాకిస్తాన్ సిబ్బంది ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ వీడియోలో కనిపించారు. ఆపరేషన్ తరువాత, లొంగిపోయిన తొమ్మిది మంది సముద్రపు దొంగలను అదనపు చట్టపరమైన చర్యల కోసం భారతదేశానికి తరలిస్తున్నామని, అక్కడ వారు మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ 2022 కింద అభియోగాలను ఎదుర్కొంటారని భారత నావికాదళం ప్రకటించింది.

ఇరాన్ నౌకను సొమాలియాకు చెందిన సముద్రపు దొంగల నుంచి కాపాడిన తరువాత అందులోని 23 మంది పాకిస్తానీ జాతీయులతో కూడిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత బోటును క్షుణ్నంగా పరిశీలించారు. అంతకుముందు, హైజాక్ కు గురైన ఇరాన్ నౌక లో నుంచి 23 మంది పాకిస్తానీ సిబ్బందిని భారత నౌకాదళం విజయవంతంగా రక్షించింది. 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇందులో ఐఎన్ఎస్ సుమేధ, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.