భర్తల అరెస్టుతో రాజీకీయాల్లో సునీతా అగర్వాల్, కల్పనా సొరేన్

భర్తల అరెస్టుతో రాజీకీయాల్లో సునీతా అగర్వాల్, కల్పనా సొరేన్
కుటుంబ వారసత్వంగా భార్యలు లేదా కుమార్తెలు రాజకీయాలలో ప్రవేశించడం, కీలక పదవులు చేపట్టడం వస్తున్నప్పటికీ అవినీతికి సంబంధించిన కేసులలో భర్తలు అరెస్ట్ అయితే భార్యలు రంగప్రవేశం చేసి, వారి పదవులు చేపట్టడం అరుదుగా జరుగుతుంది. ఎప్పుడో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయితే గృహిణిగా ఉన్న ఆయన భార్య రబ్రీ దేవి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, అప్పటి నుండి రాజకీయాలలో కొనసాగడం జరుగుతుంది.
 
ఇప్పుడు అవినీతి కేసులలోనే అరెస్ట్ కు గురయిన ఇద్దరు ముఖ్యమంత్రుల భార్యలు సహితం రాజకీయంగా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరెస్ట్ అయినా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని అరవింద్ కేజ్రీవాల్ ఒక వేళ రాజీనామా చేయాల్సి వస్తే ఆయన భార్య సునీత అగర్వాల్ ఆ పదవి చేపడతారని ప్రచారం జరుగుతుంది.
 
ఎన్నడూ రాజకీయ వేదికలలపై కనిపించని ఈ మాజీ ఐఆర్ఎస్ అధికారిని మొదటిసారిగా ఆదివారం ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఇండియా కూటమి నేతలతో జరుగుతున్న బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. అదే విధంగా ఇదే సభలో గత జనవరిలో ఈడీ అరెస్ట్ తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ కూడా పాల్గొంటున్నారు. భర్త రాజీనామా చేసిన అనంతరం ఆమె ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రచారం జరిగింది.
 
అయితే, ఆమె ఎమ్యెల్యే కాకపోవడం, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ లోపుగా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఆమె ఆ పదవికి దూరంగా ఉన్నారు. ఆమె శనివారం ఢిల్లీలో సునీత అగర్వాల్ ను ఆమె ఇంటివద్ద కలిసి సంఘీభావం తెలిపారు. శక్తివంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉంటుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీషి ట్వీట్‌ చేశారు.
“నేను సునీతాజీ బాధను పంచుకోవడానికి ఇక్కడకు వచ్చాను. ఆమె తన దుస్థితిని వివరించింది. ఈ పోరాటాన్ని చాలా దూరం తీసుకెళ్లాలని మేమిద్దరం ప్రతిజ్ఞ చేసాము. జార్ఖండ్ మొత్తం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తుంది” అని సమావేశం అనంతరం కల్పన విలేకరులతో పేర్కొన్నారు.
 
తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా ఇన్ని రోజుల పాటు సునీత విమర్శలు చేస్తూ వచ్చారే తప్ప ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో గానీ, ఆందోళనల్లో గానీ పాల్గొనలేదు. అలాంటిది  ఏకంగా ఇండియా కూటమి చేపట్టే నిరసన ప్రదర్శనకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తన భర్తకు మద్దతుగా ఆమె వాట్స్ యాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.