అవినీతి నాయకుల ముందు మోదీ తలవంచరు

మోదీ అవినీతి నాయకుల ముందు తలవంచరని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన మెగా బహిరంగ ర్యాలీలో ఎన్డీయేలో కొత్తగా మిత్రపక్షంగా చేరిన ఆర్ ఎల్ డి అధినేత జయంత్ చౌదరితో  అవినీతికి పాల్పడినందుకు కొందరు పెద్ద అవినీతిపరులను కటకటాల వెనక్కి నెట్టమని పరోక్షంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఉద్దేశించి తెలిపారు. 
 
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిపిన భారీ ర్యాలీని ముగించిన కొద్ది క్షణాల తర్వాత ఆయన ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. దేశ ప్రజలను ఎవరు లూటీ చేసినా ప్రతి ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వాలన్నది తన హామీ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
 
“నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి తిరిగి ఇచ్చేస్తాననేది నా హామీ,” అని చెప్పారు. అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా తీసినందుకే కొందరు వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు గుప్పించారు. 
 
గత పదేళ్లుగా అవినీతిపై తాము పోరాటం సాగిస్తున్న విషయం యావద్దేశానికి తెలుసునని, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా చూశామని తెలిపారు. అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని ఎద్దేవా చేశారు. ‘భ్రష్టాచార్ హఠావో’ అనేది మోదీ మంత్రమని, ‘భ్రష్టాచార్ బచావో’ అనేది వాళ్ల (విపక్షాల) మంత్రమని విమర్శించారు.
 
అవినీతిపై పోరాడుతున్న ఎన్డీయేకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని ప్రధాని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికలు కావని, అభివృద్ధి భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఎన్నికలని మోదీ  అభివర్ణించారు.
 
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గురించి మాట్లాడుతూ, రైతులను ద్వేషించే భారత కూటమి చౌదరి చరణ్ సింగ్‌కు తగిన గౌరవం కూడా ఇవ్వలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ‘‘పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంటు లోపల భారత కూటమి ఏం చేసిందో దేశం మొత్తం చూసింది. భారతరత్న అవార్డు గురించి పార్లమెంటులో మాట్లాడేందుకు మా తమ్ముడు జయంత్ చౌదరి లేచి నిలబడ్డప్పుడు ఆయనను అడ్డుకునే ప్రయత్నం జరిగింది” అంటూ ధ్వజమెత్తారు. 
 
చౌదరి చరణ్ సింగ్ ను కించపరిచేలా వ్యవహరించిన కాంగ్రెస్, ఎస్పీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఈ ప్రాంత రైతులకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు. కాగా, క‌చ్చ‌తీవు దీవి విష‌యంలో ప్ర‌ధాని మోదీ ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో దేశ‌వ్య‌తిరేక చ‌ర్య‌కు తెర‌తీసిందని ఆరోపించారు.
 
“కచ్చతీవు తమిళనాడులో, భారతదేశ తీరంలో, శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఒక ద్వీపం మరియు ఈ ద్వీపం జాతీయ భద్రత దృక్పథంలో చాలా ముఖ్యమైనది. దేశం స్వతంత్రం అయినప్పుడు, మనకు ఈ ద్వీపం దేశంలో అంతర్భాగంగా ఉంది. భారతదేశంలో భాగమే కానీ 4-5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ఈ ద్వీపం వల్ల ఉపయోగం లేదని, మన దేశంలో  కొంత భాగాన్ని కత్తిరించి భారతదేశం నుండి వేరు చేసింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రాబోయే లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, ‘వికసిత్ భారత్’  లక్ష్యంగా సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడోసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేశామని తెలిపారు. 
 
మూడో దఫా అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో తీసుకునే భారీ నిర్ణయాలపై కసరత్తు చేస్తు్న్నామని చెప్పారు. గత పదేళ్లపై ఊపందుకున్న అభివృద్ధిని మరింత శరవేగంగా పరుగులు తీయిస్తామని భరోసా ఇచ్చారు. విశిష్ట భారత్‌కు ఇదే సరైన తరుణం అని ఎర్రకోట నుంచి తాను చెప్పానని, ఈరోజు దేశంలో ఆధునాతన సౌకర్యాల కల్పన శీఘ్రగతిని జరుగుతోందని చెప్పారు. 
 
అసాధారణ రీతిలో పెట్టుబడులు, యువతకు నూతన అవకాశాల కల్పన, మహిళా సాధికారత, కొత్త తీర్మానాలతో దేశం పురోగమిస్తోందని, దేశ సామర్థ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటోందని, యావత్ ప్రపంచం ఇండియా వైపే చూస్తోందని భరోసా వ్యక్తం చేశారు.