అరుణాచల్‌లో 10 మంది ఎమ్మెల్యేల ఎన్నిక ఏకగ్రీవం

అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగక ముందే 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్‌లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్‌ల గడువు ముగిసిన అనంతరం రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకుగాను 10 స్థానాల్లో కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉన్నాయి. ఆ పది మందిలో అందరూ బీజేపీ అభ్యర్థులే ఉన్నారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో వారు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌ కూడా ఉన్నారు. సీఎం ఖండూ ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ చౌఖామ్‌ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌లు వేశారు. 

ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన మిగతా 8 మందిలో సగలీ అసెంబ్లీ స్థానం నుంచి రతు టెకీ, తాలీ నుంచి జిక్కీ టకో, తలిహా నుంచి న్యాటో దుకమ్‌, రోయింగ్‌ నుంచి ముట్చు మితి, జిరో హపోలీ నుంచి హేగ్ అప్పా, ఇటానగర్‌ నుంచి టెకీ కసో, బొండిలా నుంచి డోంగ్రు సియోంగియూ, హయులియాంగ్‌ నుంచి దసంగ్లూ పుల్‌ ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి విడత లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏప్రిల్‌ 19న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది.