టెలికం శాఖ పేరుతో కాల్స్ .. జాగ్రత్త

కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ  మొబైల్ ఫోన్ యూజర్లకు శుక్రవారం ఓ అడ్వైజరీని జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా మొబైల్ నెంబర్‌ను డిస్‌కనెక్ట్ చేస్తామంటూ కొందరు తమ డిపార్ట్‌మెంట్ పేరుతో కస్టమర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని టెలికమ్యూనికేషన్ శాఖ హెచ్చరించింది.
 
అవన్నీ నకిలీ కాల్స్ అని పేర్కొంటూ అటువంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. టెలికాం శాఖ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ నెంబర్‌ను నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. విదేశీ మొబైల్ నెంబర్ల నుంచి వాట్సప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారులమని నమ్మిస్తున్నారు.
 
ఇలాంటి కాల్స్ తో సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుంటారు అని టెలికమ్యూనికేషన్ శాఖ అప్రమత్తం చేసింది. అంతేగాక, తమ విభాగం తరపున అలాంటి కాల్స్ చేయడానికి తాము ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేసింది టెలికాం శాఖ.  వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆ కాల్స్ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దని టెలికాం శాఖ తమ అడ్వైజరీలో స్పష్టం చేసింది. 
 
ఈ మోసపూరిత కాల్స్ గురించి యూజర్లు వెంటనే తమ అధికారిక వెబ్‌సైట్ www.sancharsaathi.gov.in లో ఫిర్యాదు చేయాలని టెలికాం శాఖ కోరింది. ఈ సంచార్ సాథీ పోర్టల్‌లో ‘నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే ఆప్షన్‌కు వెళ్లి యూజర్లు తమ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఈ సైబర్ మోసాల బారిన పడితే.. 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని టెలికాం శాఖ సూచించింది.