ఈడీ ముందు హాజరైన మరో ‘ఆప్’ మంత్రి కైలాష్ గెహ్లాట్

 
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కూడా ‘ ఆప్’ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో అవినీతి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్ శనివారంనాడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
నజఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్న గెహ్లాట్ (49) కేజ్రీవాల్ మంత్రివర్గంలో రవాణా, హోం అండ్ లా మంత్రిగా ఉన్నారు. పీఎంఎల్ఏ కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసిందని, కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయనకు ఈ సమన్లు వచ్చాయని అధికారిక వర్గాల సమాచారం.
2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌ నాయర్‌ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్‌ తరచూ ఫోన్‌ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 1వ వరకూ ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. కేజ్రీవాల్ తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపణగా ఉంది. 

కాగా, ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైలులో ఉన్నారు.