వామపక్షాలకు కూడా ఆదాయపన్ను నోటీసులు

జరిమానాలు, వడ్డీలు కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయపన్ను శాఖ నోటీసు ఇచ్చిన రోజే రెండు వామపక్ష పార్టీలకు కూడా ఇదే రకమైన తాఖీదులు పంపారు. రూ.11 కోట్ల బకాయి చెల్లించాలని సిపిఐకి, రూ.15.59 కోట్లు కట్టాలని సిపిఎంకు నోటీసులు పంపారు. 

పాత పాన్‌కార్డు ఉపయోగించిందన్న సాకు చూపి రూ.11 కోట్లు కట్టాలని సిపిఐకి పంపిన నోటీసులో సూచించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇక సిపిఎంకు సంబంధించి 2016-17లో ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశారు. ఆ మదింపు సంవత్సరానికి సంబంధించి సెక్షన్‌ 148ఏ కింద తమకు నోటీసు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

‘మదింపుదారుడు బ్యాంక్‌ ఖాతాను నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఖాతాను ఆదాయపన్ను రిటర్న్‌లోని కాలమ్‌ 13 (బి)లో ప్రకటించలేదు’ అని ఆ నోటీసులో తెలియజేశారు. ఈ సెక్షన్‌ కింద మదింపు జరగని ఆదాయంపై నోటీసు అందజేస్తారు. కేంద్ర కమిటీ స్థాయిలో తాము ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను ఫైల్‌ చేస్తామని, ఈ బ్యాంక్‌ ఖాతాను ఉదహరించకపోవడం పొరబాటున జరిగిందని సిపిఎం వివరణ ఇచ్చింది.

అయితే దీనిని ఆదాయపన్ను శాఖ 2022 జూలై 29న తోసిపుచ్చింది. కేసును తిరగదోడి సెక్షన్‌ 148 కింద ఇప్పుడు నోటీసు పంపింది. గతంలో తనకు అందిన నోటీసుపై పలు సందర్భాలలో వివరణలు ఇవ్వడం జరిగిందని సిపిఎం వివరించింది. ఈ వ్యవహారంపై సిపిఎం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సమాధానం ఇచ్చేందుకు గడవు పొడిగింపు కోరుతూ పార్టీ నుండి తనకు అభ్యర్థన ఏదీ అందలేదని ఆదాయపన్ను శాఖ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

 సాధారణంగా ఇలాంటి కేసుల్లో గడువు పొడిగింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఐటి శాఖ స్పందించే వరకూ (జూలై నెల) సిపిఎం ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సిపిఎంకు సంబంధించిన పన్ను వివాదం 2022లో మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

మరోవంక,  ‘2017-18లో 1297 మంది వ్యక్తులు తమ పేర్లు, చిరునామాలు వెల్లడించకుండా బిజెపికి రూ.42 కోట్లు అందించారని ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం స్పష్టంగా చెబుతోంది. కేవలం రూ.14 లక్షల డిపాజిట్లకే కాంగ్రెస్‌కు రూ.135 కోట్ల జరిమానా విధించారు. మా పార్టీ బ్యాంక్‌ ఖాతాలు స్తంభింపజేశారు. ఈ లెక్కన గత ఏడేళ్లలో బిజెపికి రూ.4,600 కోట్ల జరిమానా విధించాల్సి ఉంటుంది’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.