ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడు కేసీఆరే

* సీబీఐకి అప్పగించాలని రఘునందన్ డిమాండ్
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను సిబిఐకి అప్పగించాలని బిజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని గుర్తు చేస్తూ దీనిని బట్టి 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందని ఆయన తెలిపారు.
 
ఈ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే చాలదని స్పష్టం చేశారు.  మొదటి నిందితుడిగా కేసీఆర్, రెండో నిందితుడిగా హరీశ్ రావు, మూడో నిందితుడిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలను  పెట్టాలని రఘునందనరావు డిమాండ్ చేశారు.  టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డిపిజి, ఎస్‌ఐబి చీఫ్ ఎవరున్నారో కూడా చూడాలని పేర్కొంటూ ఈ వ్యవహారంలో అధికారులను కూడా క్షమించకూడదని తెలిపారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు పూర్తి కాదంటూ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. 
 
గత డిజిపి పిఎ శ్రీనాథ్ రెడ్డి అధికారిక ఖర్చుతో అమెరికా వెళ్లారని బిజెపి నేత వెల్లడించారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని రఘునందన్ రావు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు రఘునందన్ రావు చెప్పారు.
ఓ మాఫియాగా ఏర్పాడి ఫోన్ ట్యాప్పింగ్ చేశారు
 
రాజకీయపరమైన వ్యక్తులపై, అధికారులపై, వ్యాపారస్తులపై, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బిఆర్‌ఎస్‌పాలనలో ఒక వెలుగువెలిగిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు తమకు ఆధారాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడి, బ్లాక్ మెయిలింగ్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.