అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన

ఓడ ఢీకొనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌ నగరంలోని ప్రధాన వంతెన మంగళవారం కుప్పకూలిపోయింది. ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జి అడుగు భాగాన్ని కంటైనర్‌ షిప్‌ ఢకొీనడంతో ఈ వంతెన కూలిపోయి పటాప్‌స్కో నదిలో పడిపోయింది. ఈ వంతెనపై వెళుతున్న పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. దీంతో సుమారు 20 మంది వాహనదారులు నదిలో చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఆ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. నౌక ఢీకొన్న స‌మ‌యంలో గల్లంతైన వారు మృతిచెంది ఉంటార‌ని భావిస్తున్నారు. నౌక ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌ర్ పోయింద‌ని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సుర‌క్షితంగా ఉన్నారు.
బ్రిడ్జ్‌పై రిపేర్ వ‌ర్క్ చేస్తున్న ఆరుగురు గల్లంతైన్నట్లు గుర్తించారు. నౌక ఢీకొన్న స‌మ‌యంలో బ్రిడ్జ్‌పై ఉన్న గుంత‌ల‌ను ఆ వ‌ర్క‌ర్లు రిపేర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బ్రిడ్జి మొత్తం ధ్వంసమైందని, నదిలో డజన్లకొద్దీ కార్లు,  పలు వాహనాలు పడిపోయాయని అందులో ట్రాక్టర్‌ వంటి భారీ వాహనాలు కూడా ఉన్నాయని బాల్టిమోర్‌ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్‌ కార్ట్‌రైట్‌ అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

బాల్టిమోర్ లోని ప్రధాన వంతెనను ఢీకొట్టి కింద నదిలో పడిపోయిన కార్గో నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని షిప్ మేనేజ్ మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, పటాప్‌స్కో నదిపై 2.6 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణమై ఉన్నది.

మున్సిపల్‌ బాల్టిమోర్‌కు నైరుతి దిశలో నాలుగు లైన్ల వంతెన ఇది. ఈ వంతెనను 1977లో ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి సుమారు 11 లక్షల కంటే ఎక్కువ వాహనాలు ఈ వంతెనపై వెళతాయి.  ఈ బ్రిడ్జి రాజధాని వాషింగ్టన్‌ డిసి పక్కన యుఎస్‌ ఈస్ట్‌ కోస్ట్‌లోని పారిశ్రామిక నగరమైన బాల్టిమోర్‌ చుట్టూ ఉన్న రహదారి నెట్‌వర్క్‌లో ప్రధాన భాగంగా ఉంది. ఈ వంతెనను ఢీకొట్టింది ‘డాలీ’ అనే సింగపూర్‌ ఫ్లాగ్‌ ఉన్న కంటైనర్‌ షిప్‌ అని ‘షిప్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ మెరైన్‌ ట్రాఫిక్‌’ తెలిపింది. 

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తమకు అందిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాల్టిమోర్‌ మేయర్‌ బ్రాండన్‌ స్కూట్‌, బాల్టిమోర్‌ కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ జానీ ఒల్సెజ్వస్కీలు చెప్పారు. ఈ ప్రమాదం వల్ల నదిలో చిక్కుకున్న వారిపట్ల ప్రార్థించండి అని ఒల్సెజ్వస్కీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇది ఐ-95 అంతరాష్ట్ర రహదారిలో భాగంగా ఉంది. ఇది అమెరికా తూర్పు తీరంలోని మయామి, ఫ్లోరిడాను, మైనేను కలిపే ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారి. మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో పటాప్స్కో నదిపై ఒక సరకు రవాణా నౌక అదుపుతప్పి బాల్టిమోర్ వంతెన పిల్లర్ ను ఢీకొన్నది. దాంతో, బాల్టిమోర్ వంతెన ఒక్కసారిగా, పాక్షికంగా కూలిపోయింది. మరోవైపు, వంతెనను ఢీ కొన్న తరువాత ఆ సరకు రవాణా నౌకలో మంటలు చెలరేగాయి.