కవిత బినామీ ఆర్థిక వ్యవహారాలపై ఈడీ దృష్టి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అరెస్టయి ఈడీ కస్టడీలో ఉ‍న్న కవిత విషయంలో ఈడీ అధికారులు మొదట 7 రోజుల కస్టడీ తర్వాత, ఇప్పుడు మరో మూడు రోజులపాటు రిమాండ్‌ పొడిగించిన విషయం తెలిసిందే. ఓవైపు కస్టడీలో భాగంగా కేసు గురించి లోతుగా విచారణ చేస్తున్న ఈడీ మరోవైపు కవిత ఆస్తులపై ఆరా తీసే పనిలో పడింది. 

ఇప్పటికే ఆమె భర్త అనిల్, ఆడపడుచు అఖిలతో పాటు పలువురు బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది. వారి ఆస్తులు, లావాదేవీలపై ఆరా తీసింది. కాగా ఇప్పుడు ఈడీ అధికారులు నిజామాబాద్‌పై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే  కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టిన ఈడీ అధికారులు వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. 

ఈ క్రమంలోనే అనిల్‌ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక.. కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. కవిత ఆస్తులకు సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా? అనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. 

ఈ సందర్భంగా, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పనిచేసి బదిలీ అయిన ఓ కీలక అధికారితో పాటు మరో రెవెన్యూ ఉ‍ద్యోగిపైనా ఈడీ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్‌కు రానున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ కేసులో కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అయితే సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉందని భావిస్తోంది ఈడీ. 

కవితకు మేక శరణ్ అత్యంత సన్నిహితుడని, అరెస్ట్ సమయంలోనూ అతను ఇంట్లోనే ఉన్నాడని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు ఈడీ తెలిపింది. దీంతో శరణ్ మీద కూడా ఈడీ దృష్టి సారించింది.