ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్‌లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పడిపోయాయి. ఈ సీజన్‌లో తాజాగా ఉత్పత్తులను సరఫరా చేయడంతో దాన్ని తొలగిస్తామని వ్యాపారులు ఊహించారు. తాజాగా మరోసారి ఎగుమతులపై నిషేధం విధించింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం పేర్కొంది. అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లి ధరలు డిసెంబర్‌లో 100 కిలోలకు రూ.4,500 నుంచి రూ.1,200 పడిపోయాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు వారాల పాటు దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

‘ఈ నెల 31 వరక ఉల్లిపాయల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పాడిగించడమైంది’ అని విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్ (డిజిఎఫ్‌టి) ఓ  ఉత్తర్వులో తెలిపింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుండే మంత్రిత్వశాఖలోని ఒక విభాగం డిజిఎఫ్‌టి.

బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యూఏఈ దేశాలు భారత్‌ నుంచి దిగుమతులపైనే ఆధారపడుతాయి. కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిలో సగానికి పైగా భారత్‌దేనని  మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి.