కేజ్రీవాల్ సీఎంగా కొన‌సాగ‌డం ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం

లిక్క‌ర్ స్కామ్‌లో అరెస్ట‌యిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని ఆప్ నేత‌లు చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అర‌వింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, చ‌ట్టానికి, ప్ర‌జాస్వామ్యానికి అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు.

కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతూ, సోనియా గాంధీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసే పార్టీ 9 స‌మన్లు జారీ చేసినా ఈడీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎందుకు ద‌ర్యాప్తు నుంచి త‌ప్పించుకు తిరుగుతున్నారు..ఈ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అంతా బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు. ఢిల్లీ నూత‌న మద్యం విధానం మెరుగైన‌దే అయితే దాన్ని ఎందుకు వెన‌క్కి తీసుకున్నార‌ని బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధూరీ ఆప్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

ఎక్సైజ్ పాల‌సీ స‌రైంది కాద‌ని తాను అర‌వింద్ కేజ్రీవాల్‌తో చెప్పాన‌ని, ఈ పాల‌సీతో ప్ర‌భుత్వానికి రూ. 3000 కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. ఇక అర‌విద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎప్ప‌టికీ కొన‌సాగుతార‌ని ఢిల్లీ మంత్రి అతిషి స్ప‌ష్టం చేశారు. జైలు నుంచే ఆయ‌న పాల‌న న‌డిపిస్తార‌ని చెప్పారు. కేజ్రీవాల్ దోషిగా తేల‌లేద‌ని, ఆయ‌న ఢిల్లీ సీఎంగా ఉంటార‌ని తెలిపారు.

క‌ర్మ ఫ‌లితం వెంటాడింది

కాగా, అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందిస్తూ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమార్తె శ‌ర్మిష్ట ముఖ‌ర్జీ కేజ్రీవాత్ గ‌తంలో చేసిన ప‌నుల‌కు సంబంధించిన ప‌రిణామాల‌ను ఎదుర్కొంటున్నార‌ని, ఆయ‌నను క‌ర్మ వెంటాడింద‌ని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ గ‌తంలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ స‌హా కాంగ్రెస్ నేత‌ల‌పై నిరాధార‌, బాధ్య‌తారాహిత్య ఆరోప‌ణ‌లు చేశార‌ని శ‌ర్మిష్ట గుర్తుచేశారు. ఎక్స్ వేదిక‌గా కేజ్రీవాల్ తీరును ఆమె త‌ప్పుప‌ట్టారు. క‌ర్మ అనుస‌రించిందని ఆ పోస్ట్‌లో శ‌ర్మిష్ట పేర్కొంటూ కేజ్రీవాల్ గ‌తంలో చేసిన చ‌ర్య‌లే ఆయ‌న‌ను వెంటాడుతున్నాయ‌ని రాసుకొచ్చారు. 

కేజ్రీవాల్‌తో పాటు అన్నా హ‌జారే బృందం గ‌తంలో షీలా దీక్షిత్ స‌హా కాంగ్రెస్ నేత‌ల‌పై నిరాధార‌, బాధ్య‌తారాహిత్య ఆరోప‌ణ‌లు చేశార‌ని, షీలా దీక్షిత్‌పై ఎన్నో ఆధారాలున్నాయ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నార‌ని ఆమె గుర్తుచేశారు. అయితే ఆ ఆధారాల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌లేద‌ని, కానీ క‌ర్మ ఫ‌లితం అనుభ‌వించాల‌ని ఎక్స్ వేదిక‌గా శ‌ర్మిష్ట పోస్ట్ చేశారు.